అవును, మీరు చదివింది నిజమే. కురుక్షేత్ర యుద్ధాన్ని మూడంటే
మూడు బాణాలతో ముగించగల వీరుడు ఒకడు ఉన్నాడు. అతని పేరే బార్బారికుడు. అసలు ఎవరు
ఈ బార్బారికుడు ఇతనికి కురుక్షేత్ర యుద్ధానికి ఏంటి సంబంధం అని
తెలుసుకుందాం.
కృష్ణుడు యుద్ధానికి ముందు ఒక పత్రంలో అందరు వీరుల గురించి
అధ్యయనం చేస్తున్నాడు. అందులో భీష్ముడు కురుక్షేత్ర యుద్ధాన్ని 20 రోజులలో
ముగించగలడు. ద్రోణాచార్యుడు 25 రోజులలో ముగించగలడు, కర్ణుడు 24 రోజుల్లో,
అర్జునుడు 28 రోజుల్లో, భీముడు 30 రోజుల్లో ముగించగలడు అని ఉంది. కృష్ణుడు ఆ
జాబితాను చదువుతూ వెళుతుండగా ఆఖరిగా ఒక పేరు ఉంది. అతను ఒక్క నిమిషంలో
కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగలడు. అతనే బార్బారికుడు. కృష్ణుడికి ఇతడిని
కలవాలి అనిపించింది. వెంటనే కృష్ణుడు బార్బారికుడిని పిలిపించాడు.
కృష్ణుడు అతడిని పిలిపించి "ఎవరు నువ్వు?" అని అడిగాడు.
అప్పుడు బార్బారికుడు "నన్ను బార్బారికుడు అని అంటారు. నేను భీముడి కొడుకు
అయిన ఘటోత్కచుడి కొడుకును. నా తల్లి పేరు మౌర్వి. నా తల్లి నీకు పరమ
భక్తురాలు." అని చెప్పి కృష్ణుడి కళ్ళకు నమస్కరించాడు.
మౌర్వి అని పేరు వినగానే కృష్ణుడికి తన గతం గుర్తుకు వచ్చింది. ఒకప్పుడు నరకాసురుడి స్నేహితుడు అయిన మురుడు భూలోకంలో అల్లకల్లోలం సృష్టించేవాడు. అందుకు కృష్ణుడు అతడిని చంపేస్తాడు. ఆ మురుడి చెల్లెలే మౌర్వి. తన అన్న చావుకు కారణం అయిన కృష్ణుడిని చంపడానికి కృష్ణుడితో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం చాలా రోజులు కొనసాగుతుంది. దాంతో కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సంధించడానికి సిద్ధపడతాడు. అప్పుడు అక్కడికి కామాఖ్యదేవి ప్రత్యక్ష్యం అయ్యి కృష్ణుడిని ఆపింది. అప్పుడు కృష్ణుడితో "కృష్ణ, ఈమె నా భక్తురాలు. ఈమెకు నేను అన్ని విద్యలను వరంగా ఇచ్చాను. కాబట్టి ఈమెను వదిలెయ్యి" అని కృష్ణుడిని కోరుతుంది. కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అలాగే ఆ కామాఖ్యదేవి మౌర్వితో "ఈ కృష్ణుడు ఎవరో కాదు, మహావిష్ణువు అవతారం." అని చెప్పగా మౌర్వి కృష్ణుడి పాదాల మీద పడి అప్పటి నుంచి కృష్ణుడి భక్తురాలు అయ్యింది.
వెంటనే తేరుకొని కృష్ణుడు బార్బారికుడితో "నువ్వు యుద్ధాన్ని
ఒక్క నిమిషంలో ముగించగలవు అని విన్నాను. అది ఎలా సాధ్యం నీకు ఎలా అవుతుంది."
అని అడిగాడు. అప్పుడు బార్బారికుడు "ఆ మహాశివుడిని ప్రార్థించగా నాకు ఈ మూడు
బాణాలను ఉపయోగించి చేయగలను. నేను ఈ మూడు బాణాలు వదిలి పెట్టిన వెంటనే మొదటి
బాణం నా లక్ష్యాన్ని గుర్తుకు పెట్టుకుంటుంది. రెండవ బాణం నా మిత్రులు ఎవరో
గుర్తుకు పెట్టుకుంటుంది. మూడవ బాణం నా లక్ష్యాన్ని చేదిస్తుంది." అని
చెప్పాడు.
కృష్ణుడు బార్బారికుడిని పరీక్షించాలి అని అనుకొని అక్కడ ఒక
చెట్టు మీద ఉన్న అన్ని ఆకులను సగంగా చేయమని కోరతాడు. అప్పుడు బార్బారికుడు
కళ్ళు మూసుకొని ఆ బాణాలను వదలగా మొదటి బాణం లక్ష్యాన్ని గుర్తు పెట్టుకుంది.
రెండవ బాణం ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఒక్క ఆకును కూడా వదలకూడదు. మూడవ
బాణం ఆ చెట్టుమీద ఉన్న అన్ని ఆకులను సగం చేసి కృష్ణుడి కాలు దగ్గర
తిరుగుతుంది. అప్పుడు కృష్ణుడు అర్థం చేసుకొని తన కాలును తీసేసాడు వెంటనే ఆ
బాణం కృష్ణుడి కాలు కింద ఉన్న ఆకును సగం చేసింది. ఇది చూసి కృష్ణుడికి మొత్తం
అర్థం అయ్యింది.
"నువ్వు ఎవరి వైపు పోరాడతావు?" అని కృష్ణుడు అడగగా, "నేను బలహీనంగా ఉన్న సైన్యం వైపు పోరాడతాను" అని చెప్తాడు. పాండవుల సైనికబలగం 7 అక్శౌహినుల సైన్యం ఉంది అలాగే కౌరవుల సైనికబలగం 11 అక్శౌహినుల సైన్యం ఉంది. బలహీనంగా ఉంది పాండవుల సైన్యం కాబట్టి బార్బారికుడు పాండవుల వైపు పోరాడటానికి సిద్ధం అయితే, కౌరవుల వైపు 5 అక్శౌహినుల సైన్యం అంతం కాగానే బార్బారికుడి బాణం పాండవుల వైపు తిరుగుతుంది. పాండవుల సైన్యం 6 అక్శౌహినులు అవ్వగానే కౌరవుల వైపు 1 అక్శౌహిని సైన్యం అలా మొత్తం కురుక్షేత్రంలో ఉన్న అందరు చనిపోతారు కృష్ణుడితో సహా. ఆఖరికి బార్బారికుడు మాత్రమే మిగిలిపోతాడు. ఇదంతా ఆలోచించిన కృష్ణుడికి ఒక ఆలోచన వచ్చింది.
"బర్బరికా, నీ తల్లి నాకు భక్తురాలు అన్నావు కదా. మరి నీకు కూడా
నీ తల్లి అంత భక్తి నా మీద ఉందా?" అని అడుగుతాడు కృష్ణుడు. "అవును కృష్ణా, నా
తల్లి లాగే నాకు కూడా నీ మీద అపారమైన భక్తి ఉంది" అని బార్బారికుడు చెప్పగా,
కృష్ణుడు "అయితే నాకు ఒక వరం కావలి ఇస్తావా?" అని అడిగాడు. అందుకు బార్బారికుడు
"కచ్చితంగా ఇస్తాను వాసుదేవా." అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు ఒక అద్దం తీసుకు
వచ్చి బార్బారికుడి ముందు పెట్టి "ఈ వీరుడి తల కావాలి" అని కోరతాడు.
బార్బారికుడికి అర్థం అయ్యింది అప్పుడు "వాసుదేవా, నువ్వు అడిగినట్టుగానే నా
తలను నీకు ఇస్తాను. కాని నాకు ఒక ఆఖరి కోరిక ఉంది. నేను కురుక్షేత్ర యుద్ధాన్ని
చూడాలనుకుంటున్నాను." అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు "నీ తలను నేను ఆ కొండ మీద
పెడతాను. అక్కడి నుంచి నీకు కురుక్షేత్రం జరుగుతున్న ప్రదేశం కనిపిస్తుంది" అని
చెప్పాడు. దానికి బార్బారికుడు సంతోషించి తన తలను నరికేసుకొని కృష్ణుడికి
ఇచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఆ తలను తీసుకు వెళ్ళి ఒక కొండ మీద పెట్టాడు.
అలా ఒక మహావీరుడు మరణించాడు. ఇది బార్బారికుడి కథ. ఈ కథ నుంచి
మనం నేర్చుకునే నీతి ఏంటంటే మనలో ఎంత సామర్ధ్యం ఉన్నప్పటికీ మనం ఎవరి గొడవలలో
తల దూర్చకూడదు. మనం సహాయం చేద్దాం అని అనుకున్నపుడు ఆ గొడవ ఇంకా వేడి
ఎక్కడమో, ఏదన్న ఘోరం జరగదమో అవుతుంది. మనం ఆ గొడవను చల్లార్చగలం అని
అనుకున్నపుడు కొన్ని సార్లు అది తారుమారు అవుతూ ఉంటుంది. ఆ గొడవ ఎందుకు
వచ్చిందో మనం అందులో దిగితే మనం ఆ గొడవను ఎలా మారుస్తామో ఒకసారి
ఆలోచించగలగాలి. ఇక్కడ పాండవుల వైపు తక్కువ సైన్యం ఉంది కనుక తక్కువ ఉన్న
వాళ్ళ తరపున పోరాడతా అన్నాడు. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు.
అందుకే కృష్ణుడు ఆ అనర్థం జరగకుండా ఆపినందుకు పాండవులు గెలవగాలిగారు. ఇంతటితో
ఈ కథ సమాప్తం. స్వస్తి.
- భరత సంహితం
No comments:
Post a Comment