మనకు కురుక్షేత్రం యుద్ధంలో పాండవులు విజయాన్ని సాధించారు అని తెలుసు. కానీ ఆ విజయం కోసం ఎంతో మంది మహావీరులు బలి అవ్వాల్సి వచ్చింది. ఆ మహావీరులలో ఇరవనుడు ఒకడు. ఇతడిని ఇరవనుడు అనీ, అరవానుడు అని కూడా అంటారు. ఇతను అర్జునుడి కొడుకు. మరి ఈ ఇరవనుడు ఎవరో అర్జునుడికి ఎవరి వల్ల ఇతను పుట్టాడో మనం ఈ కథ నుండి తెలుసుకుందాం.
పాండవులు ఇంద్రప్రస్థం అనే నగరాన్ని కాండవవనం ఉన్న ప్రదేశంలో
నిర్మించుకున్నారు. ద్రౌపదితో అయిదుగురు ఒకేసారి కాపురం చేయలేదు కనుక ఒక
నియమం పెట్టుకున్నారు దాని ప్రకారం, ద్రౌపది సంవత్సరంలో ఒక్కరితోనే కాపురం
చేస్తుంది. ఆ ఒక్కరే ద్రౌపది మందిరానికి వెళ్ళాలి. ఆ నియమాన్ని ఉల్లంగించిన
వారు ఒక సంవత్సరం అరణ్యానికి వెళ్ళాలి అని ఆ నియమం.
ఒకరోజు తమ గోవులను కాపాడమని ఒక బ్రాహ్మణుడు ఆర్జునుడిని కోరగా తన ఆయుధమైన గాండీవం ద్రౌపది మందిరంలో ఉంది అని గుర్తుకువస్తుంది. చేసేది ఏం లేక అర్జునుడు, ద్రౌపది మందిరానికి వెళతాడు. ఆ సంవత్సరం యుధిష్ఠిరుడు ద్రౌపదితో కాపురం చేస్తుంది. అర్జునుడు తన గాండివాన్ని తీసుకొని ఆ గోవులను కాపాడి, తమ నియమం ఉల్లంగించినందుకు ఒక సంవత్సరం అరణ్యానికి వెళతాడు. అలా అరణ్యంలో వెళుతుండగా ఒక నాగకన్య అయిన ఉలూపిని చూసి ఇష్టపడి, పెళ్లి చేసుకుంటాడు అర్జునుడు. వారికి పుట్టినవాడే ఈ ఇరవనుడు.
కురుక్షేత్రం జరుగబోతుంది అని తెలిసిన తరువాత పాండవులు తమ వ్యూహాల గురించి చర్చించుకుంటున్న సమయంలో వారి సైనికబలగం చాలా తక్కువ ఉంది అని అర్థం అవుతుంది. వెంటనే పాండవులు కృష్ణుడి దగ్గరికి వెళ్ళగా ఒక నరబలి కాళికాదేవికి ఇస్తే మనకు విజయం వస్తుంది అని కృష్ణుడు సలహా ఇస్తాడు. ఎలాంటి వారిని బలి ఇవ్వాలి అని పండితులని అడగగా 32 లక్షణాలు ఉన్న ఒక మనిషిని బలి ఇవ్వాలి అని చెప్పగా అందరు ఆలోచనలలో పడ్డారు. అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు పాండవుల సైన్యంలో ముగ్గురే ఉన్నారు. వారు కృష్ణుడు, అర్జునుడు ఇంకా ఇరవనుడు.
కృష్ణుడిని బలి ఇస్తే పాండవులు కచ్చింతంగా యుద్ధం ఓడిపోతారు. అలా అని అర్జునుడు ఒక మహాధనుర్ధారి కాబట్టి అతడిని కూడా బలి ఇవ్వలేము. కాబట్టి ఇరవానుడిని బలి ఇవ్వాలి అని అనుకోని వెళ్ళి అతడిని అడిగారు పాండవులు. వెంటనే ఇరవనుడు ఒప్పుకున్నాడు. కాని తనకు రెండు కోరికలు ఉన్నాయి అని అవి తీరకుండా నేను చనిపోలేను అని కోరగా తన కోరికలను వివరించాడు.
మొదటిది, తను వివాహం చేసుకోకుండా చనిపోను అని కోరగా అందరూ
ఆలోచనలో పడ్డారు. ఒక్కరోజు కోసం ఏ కన్య పెళ్లి చేసుకోడానికి ముందుకు రాదు.
ఇంక వేరే దారి లేక కృష్ణుడు మోహినీ అవతారం ఎత్తి ఇరవానుడిని పెళ్లి
చేసుకున్నాడు. రెండవది, తను యుద్ధంలో వీరమరణం పొందాలి అని. అప్పుడు
కృష్ణుడు ఆ వరాన్ని ఇస్తాడు. ఆ వరంతో ఇరవనుడు బలి అయినప్పటికీ తను యుద్ధం చేయగలడు అని ఆ వరం.
అలా ఇరవనుడు బలికి సిద్ధం అయ్యాడు. సహదేవుడు ఒక అమావాస్యనాడు బలి ఇవ్వాలి అని ముహూర్తం పెట్టగా. ఆ రోజు కాళికాదేవికి ఇరవానుడి శరీరాన్ని 32 భాగాలుగా చేసి బలి ఇవ్వగా, కాళికాదేవి ప్రత్యక్షం అయ్యి పాండవులకు కచ్చితముగా విజయం కలుగుతుంది అని దీవించింది. కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం ఇరవానుడిని బతికించాడు. ఇరవనుడు వీరోచితంగా పోరాడి ఆలంబాసురుడి చేతిలో మరణిస్తాడు. అలా ఇరవానుడి రెండవ కోరిక తీరుతుంది.
యుద్ధం కోసం, ధర్మం కోసం తనకి తానుగా బలికి సిద్ధపడ్డాడు. ఎలాంటి రెండవ ఆలోచన లేకుండా పాండవులు అడిగిన వెంటనే తను బలికి సిద్ధం అని వెంటనే అంగీకరించాడు ఇరవనుడు. అలాంటి ఇరవానుడిని తమిళనాడులోని కువంగం అనే గ్రామంలో ఇరవానుడిని తలుచుకుంటూ 18 రోజులు పండుగ చేస్తారు. ఈ పండుగకు దేశం నలుమూలల నుంచి హిజ్రాలు ఈ పండుగకు వచ్చి ఇరవానుడిని భర్తగా భావించి ఆ 18 రోజులు అక్కడే ఉంటారు.
అలా ఇరవనుడు తన తండ్రి విజయం కోసం, ధర్మం గెలవడం కొరకు ధర్మం కోసం తనని తాను బలికి అర్పించాడు. మనం మన వాళ్ళ కోసం, మన కుటుంబం కోసం ఎప్పుడు అలాగే తోడుగా ఉండాలి. అప్పుడే అన్ని కుటుంబాలు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదురుకోగలగాలి. అలాంటి ధైర్యం కోసం మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. మన కుటుంబానికి మనం అన్నివేళలా అండగా ఉందాం. అలా కుటుంబానికి అండగా ఉంటూ తన వంతు సహాయం చేస్తూ ఆ కుటుంబానికి ధర్యాన్ని ఇస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అని కోరుకుంటూ. స్వస్తి.
- భరత సంహితం
No comments:
Post a Comment