Pages

కురుక్షేత్రం తరువాత బ్రతికి ఉన్న ఒకేఒక్క కౌరవుడు - Survived Kaurava in Kurukshetra

 

      Image Source : StoryPick

    కౌరవులు అనగానే మనకు ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ కౌరవులలో దుర్యోధనుడు అంటే మనకు ఇంకా ద్వేషం. ఆ వంద మంది కౌరవులు అందరూ కురుక్షేత్రంలో భీముడి చేతిలో హతం అయిన విషయం మనకు తెలిసిందే. కానీ ఆ వంద మంది కౌరవులు కాకుండా ఇంకొక కౌరవుడు ఆ యుద్ధంలో పోరాడాడు. ఆయన పేరు యుయుత్సుడు. ఆయన కురుక్షేత్రంలో పాల్గొన్నప్పటికీ ఆయన మరణించలేదు. ఆయన కథ ఏంటో తెలుసుకుందాం.

    పాండురాజు తనకు తగిలిగిన శాపాన్ని తలుచుకొని బాధపడి, రాజ్యాన్ని త్యాగం చేసి అడవులకు వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు ఆయన భార్యలు అయిన కుంతీమాద్రీలు కలిసి వెళ్ళారు. సింహాసనం కాళీగా ఉంది అని తలిచి దృతరాష్ట్రుడిని రాజుగా నియమించారు, ఆయన భార్య గాంధారి. పాండురాజు శాపం కారణంగా తనకు సంతానం కలుగదు అని బాధపడతున్న సమయంలో, కుంతీ వచ్చి తనకు ఉన్న వరం గురించి చెప్పగా. కుంతీ యమధర్మ రాజును ప్రార్థించగా వారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరే యుద్ధిష్టిరుడు.

    ఈ వార్త హస్తినాపురానికి చేరుతుంది. గాంధారి అప్పటికే ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు గర్భవతి గానే ఉండిపోయింది. ఇంకా తనకు సంతానం కలుగలేదు. దృతరాష్ట్రుడికి కోపం వచ్చింది. అక్కడ పాండురాజుకు ఒక కొడుకు పుట్టాడు ఇంకా తన భార్యకు పిల్లలు కలుగలేదు అని కోపించాడు. గాంధారి దాసిని దృతరాష్ట్రుడు తన అంతఃపురానికి పిలిచాడు. ఆ దాసికి, దృతరాష్ట్రుడికి పుట్టినవాడే ఈ యుయుత్సుడు.

    యుయుత్సుడు చిన్నప్పుడు అన్ని అస్త్రవిద్యలు, శస్త్రవిద్యలు నేర్చుకొని ధర్మవంతుడు అయ్యాడు. దుర్యోధనుడితో పాటు పుట్టిన యుయుత్సుడిని దుర్యోధనుడు కాని మిగితా తొంబై తొమ్మిది మంది సోదరులు దాసి కొడుకు అని పరభావించే వారు కాబట్టి ఎప్పుడు యుయుత్సుడిని పట్టించుకోలేదు. అందుకు యుయుత్సుడు పాండవుల పక్షపాతి అయినాడు.

    ద్రౌపదిని దుశ్యాసనుడు సభలోకి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చినప్పుడు యుయుత్సుడు వారిని అలా చెయ్యవద్దు అని వారించాడు. "ఒక దాసి కొడుకు మాకు ఏం చెయ్యాలో చెప్పకూడదు." అని దుర్యోధనుడు, దుశ్యాసనుడు చెప్పగా ఆ సభలో నుంచి యుయుత్సుడు వెళ్ళిపోయాడు.

    కురుక్షేత్రం మొదటి రోజు యుద్ధం ప్రారంభించే ముందు యుధిష్ఠిరుడు "మీలో ఎవరన్న వారు ఉన్న వైపు నచ్చకపోతే మా వైపు కానీ, మా వైపు ఉన్న వాళ్ళు అవతల వైపు కాని వెళ్ళవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు." అని చెప్పగా. యుయుత్సుడు తన పదివేల సైన్యాన్ని తీసుకొని పాండవుల వైపు వెళతాడు. అలా పోరాడిన వాళ్ళల్లో ఎంతోమంది మహారథులు చనిపోగా. అతికొద్దిమంది బతికినవారు ఉన్నారు. వారిలో పాండవులతో పాటు యుయుత్సుడు కూడా ఉన్నాడు.

    అలా యుద్ధంలో గెలిచిన పాండవులు ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్యం పరిపాలించారు. తరువాత ఆ రాజ్యానికి పరిక్షితుడిని రాజును చేసి యుయుత్సుడిని మహామంత్రిగా నియమించి వారు హిమాలయాలకు వెళ్ళిపోయారు.

    మనకి కూడా జీవితంలో మనం ఉన్న వైపు మంచి ఉండకపోవచ్చు. అది మంచి కాదు అని వారితో చెప్పగలగాలి. అది కుదరనప్పుడు వెంటనే వెళ్ళిపోకుండా సమయం చూసుకుని వారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అలాగే కొన్ని సార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన మాటలను లేక్కచేయకపోవచ్చు, నీ మాటకు విలువ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన మాటకు విలువ ఉన్న చోటుకు మనం వెళ్లిపోవాలి. అలా మంచి వైపు నడుస్తున్న వారందరికీ మంచి జరగాలి అని కోరుకుంటూ. స్వస్తి.

- భరత సంహితం 



No comments:

Post a Comment