Pages

కృష్ణార్జున యుద్ధం - Krishnarjuna Yuddham - Krishna and Arjuna Fight

 

Image Source : Mythgyaan

    ఈ కథ తెలియనప్పుడు, మనం మొదటిసారి ఈ పదాన్ని విన్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో స్నేహంగా ఉన్న ఇద్దరు యుద్ధం చేస్కోవడం ఏంటి అని మనకి అనిపిస్తుంది. వాళ్ళ యుద్ధం నుంచి మనం ఎన్నో నీతులు చెప్పుకోవచ్చు. ఈ కృష్ణార్జునుల యుద్ధం గురించి వ్యాసుడు మహాభారత కథలో రాయలేదు. ఈ కథ లక్ష్మి నరసింహం అనే ఒక తెలుగు పండితుడు "గయోపాఖ్యానము" అనే పేరు గల నాటకం ద్వారా మనకి తెలుస్తుంది.

        ఒకనాడు కృష్ణుడు సంధ్యావందనం చేస్తూ తన చేతిలోకి కొన్ని నీళ్ళను తీసుకున్నాడు. అటు వైపుగా ఆకాశంలో గయుడు అనే ఒక గంధర్వుడు తిరుగుతూ తన నోటిని శుభ్రం చేసుకోవడానికి కొన్ని ఆకులు నమిలేసి ఉమ్మివేసాడు. అది సరిగ్గా వచ్చి కృష్ణుడి దోసిట్లో పడింది. తన ప్రార్థనను అవమానించినందుకు కృష్ణుడు కోపంతో ఆ గయుడిని చంపాలనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న గయుడు చాలా కంగారు పడ్డాడు. తను చేసిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలో తనకి అర్థం కాలేదు. అప్పుడే అక్కడికి నారదుడు వచ్చాడు. గయుడు జరిగినది అంతా నారదుడికి చెప్పాడు. నారదుడు ఆ గయుడికి ఒక ఉపాయం చెప్పాడు. వెళ్ళి అర్జునుడికి విన్నవించుకో అని నారదుడు గయుడికి సలహా ఇస్తాడు. 

        వెంటనే ఆ గయుడు వెళ్ళి అర్జునుడి దగ్గరకు వెళ్ళి జరిగినది అంతా చెప్తాడు. అర్జునుడు తన ప్రాణాన్ని కాపాడుతానని మాట ఇచ్చాడు. ఇద్దరు కలిసి కృష్ణుడి దగ్గరికి వెళతారు. అర్జునుడు ఎంత చెప్పిన కృష్ణుడు వినలేదు ఆ గయుడిని చంపాలి అనే అనుకుంటాడు. కృష్ణుడు ఎన్ని విధాలుగా అర్జునుడికి గయుడిని అప్పజెప్పమని చెప్పిన అర్జునుడు దానికి ఒప్పుకోడు. దానితో వేరే దారి లేక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అర్జునుడు, తన ప్రార్థనను భంగం చేశాడు అని కృష్ణుడు, ఇద్దరు యుద్ధం చేయడానికి సిద్ధపడతారు.

        వారి మధ్య హోరాహోరిగా యుద్ధం సాగింది. కృష్ణుడికి బాగా కోపం వచ్చింది వెంటనే తన ఆయుధం అయిన సుదర్శన చక్రాన్ని అర్జునుడి వైపు ప్రయోగిస్తాడు. దానికి అర్జునుడు, తను ముందుగా సంపాదించుకున్న పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. రెండు ఒకదానికి ఒకటి ఎదురు పడగా మహా వినాశనం జరుగుతుంది. వెంటనే అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. వారి ఆయుధాలను వెనక్కి తీసుకోండి అని కోరతాడు. ఇదంతా వారి ఇద్దరికీ పెట్టిన పరిక్ష అని వారు నమ్మిన దానికి వారు ఎంత వరకు కట్టుబడి ఉంటారు అని పరీక్షించడానికి ఇదంతా జరిగిందని చెప్పగానే ఇద్దరు వారి వారి అస్త్రాలను వెనక్కి తీసుకున్నారు.

        మనకి జీవితంలో మనకి చాలా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలలో మనం ఏమి నమ్ముతామో దాని మీద మనం నిలబడాలి. కష్టాలు అనేవి ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా కనిపిస్తుంది. మనకు మంచిది అనిపించింది ఒకరికి చెడు కావొచ్చు. ఒకరికి చెడు అనిపించింది మనకి మంచి అవ్వొచ్చు. వీటి అన్నిటిలో మనం ఏమి నమ్ముతామో దాని వైపే మనం నిలబడాలి.

        ఆ యుద్ధం తరువాత కృష్ణుడు అర్జునుడు అదంతా మరిచి పోయి కురుక్షేత్రంలో పాల్గొన్నారు. అలాగే మన స్నేహితులని కొన్ని అపార్థాలు వచ్చాయని వారిని మర్చిపోవడం లేదా వాళ్ళ స్నేహాన్ని మర్చిపోవడం మనం చేసే పొరపాటు. మనస్పర్ధలు వస్తూ ఉంటాయి పోతుంటాయి వాటన్నిటిని మనం స్వీకరించాలి ముందుకు వెళ్తూ ఉండాలి. మనిషి బతికున్నప్పుడు పట్టించుకోము కాని వారు పోయాక వారు మనతో గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తాయి. వారితో గొడవ పడకుండా ఉంటే బాగుండు అని అనుకుంటాం. కాని వారు వెళ్ళిపోయాక బాధపడి ప్రయోజనం లేదు.

        మనం ఉన్నంత వరకు మన వాళ్ళని బాగా చుస్కుందాం. బాగా ప్రేమిద్దాం. వారితో అన్ని జ్ఞాపకాలని మూట కట్టుకొని హాయిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోదాం. మన వాళ్ళందరిని బాగా చూస్కుంటారని ఆసిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి.

- భరత సంహితం


No comments:

Post a Comment