Image Source : Mantelligence
మన జీవితంలో
స్నేహం అనే అనుబంధం చాలా ముఖ్యమైనది. ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చిన పక్కన ఒక
స్నేహితుడు భుజం తడుతూ ఉంటే ఆ స్పర్శ ఇచ్చే బరోస మనకు ఎంతో ధైర్యాన్ని
ఇస్తుంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ (character) తెలుస్తుంది
అని ఒక సినిమాలోని మాట. ఈ కలియుగంలోని స్నేహం, ముందు మూడు యుగాలలోని స్నేహాలకి
చాలా భిన్నంగా ఉంటుంది. కానీ ఏ యుగంలో అయినా స్నేహితుడితో ఉన్న అనుబంధం చాలా
గొప్పది అంటారు. మన యువతర బాగుపడుతున్నది స్నేహాల వల్లనే అలాగే చెడిపోతుంది
కూడా ఆ స్నేహాల వల్లనే.
మనం
స్నేహం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ స్నేహాలు ఎలాంటివో తెలుసుకోవాల్సిన
అవసరం మనకు ఎంతగానో ఉంటుంది. అలంటి స్నేహాలు ఎలాంటివో మహాభారత కథలో
చెప్పబడింది. మన తల్లితండ్రులను ఎంచుకునే అవకాశం మనకు లేదు, కానీ మన
స్నేహితులని ఎంచుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి అలంటి స్నేహాన్ని ఎలా
ఎంచుకోవాలి అనేది మన చేతిలో ఉంది. మహాభారతంలోని కొన్ని పాత్రల ద్వారా
మనకి స్నేహాలు ఎన్ని రకాలు అని మనం తెలుసుకోవచ్చు.
మహాభారతంలో స్నేహం మూడు రకాలుగా
చెప్పబడింది. అవి విఫలస్నేహం, సఫలస్నేహం మరియు సుఫలస్నేహం. విఫలస్నేహం అంటే
విఫలం అయిన స్నేహం అని, సఫలస్నేహం అంటే ఫలించిన స్నేహం లేదా బలమైన స్నేహం
అని, సుఫలస్నేహం అంటే మంచి ఫలితాన్ని ఇచ్చిన స్నేహం.
1. విఫలస్నేహం
ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు
Dronacharya Image Source :
Knowtify India
Drupada Image Source :
Quora
కౌరవులు పాండవుల గురువు అయిన
ద్రోణాచార్యుడు మరియు ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడు ఇద్దరు భరద్వాజ
మహర్షి దగ్గర సకల విద్యలు అభ్యసించారు. వారు ఆ గురుకులంలో ఉన్నంత వరకు
చాలా స్నేహంగా ఉన్నారు. చాలా సంతోషంగా విద్యను నేర్చుకుంటున్న సమయంలో
ద్రుపదుడు ద్రోణాచార్యుడితో ఇలా అన్నాడు "మిత్రమా ద్రోణా! నేను ఒక రోజు
నా రాజ్యానికి రాజుని అయినప్పుడు, నా సగం రాజ్యాన్ని నీకు ఇస్తాను."
అని మాట ఇస్తాడు ద్రుపదుడు. దానికి ఎంతో సంతోషించాడు ద్రోణాచార్యుడు.
కొంత కాలం తరువాత వారి విద్యను పూర్తి చేసుకొని ఎవరి దారిన వారు
వెళ్ళిపోయారు.
ద్రుపదుడు తన రాజ్యం అయిన పాంచాల
రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ ద్రోణాచార్యుడు మిక్కిలి
పేదరికంలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ద్రోణాచార్యుడికి
కొడుకు (అశ్వత్థామ) పుట్టినప్పుడు, తన కొడుకుకు కనీసం పాలు కూడా
ఇవ్వలేనంత పేదరికంలో ఉన్నాడు. అప్పుడే తన స్నేహితుడు అయిన ద్రుపదుడు
గుర్తుకు వచ్చాడు. పాంచాల దేశానికి వచ్చి తనకు రెండు ఆవులు ఇవ్వమని
కోరతాడు. అప్పుడు ద్రుపదుడు చాలా కోపముతో "ఓరి బ్రాహ్మణా! ఎవరు
నువ్వు? నీతో నాకు స్నేహం ఏంటి. రాజులకు ఎప్పుడు రాజులతోనే స్నేహం
ఉంటుంది. బ్రాహ్మణులతో కాదు." అని అవమానించి బయటికి వెళ్ళగొట్టాడు.
అలా ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కౌరవులు పాండవులకు శిక్షణ ఇచ్చి గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తీసుకురమ్మని చెప్తాడు. అలా అర్జునుడు
భీముడు ఇద్దరు ద్రుపదుడి సైన్యంతో పోరాడి ద్రుపదుడిని బంధించి
తీసుకొని వస్తారు.
అలా ద్రుపదుడు కూడా తనకు జరిగిన అవమానానికి
ప్రతీకారం కోసం ఒక యజ్ఞం చేయగా ఆ యజ్ఞం నుంచి ద్రోణాచార్యుడిని
చంపడానికి ఒక పుత్రుడిని కోరతాడు. అలా ద్రుష్టద్యుమ్నుడు పుడతాడు
అలాగే అదే యజ్ఞం నుంచి ఆర్జునుడిని తన అల్లుడిగా చేసుకోవడానికి ఒక
కూతురిని కోరగా ద్రౌపది పుడుతుంది. ఆ తరువాత కథ ఎలా జరుగుతుందో
తెలిసినదే.
ఇలా చూసుకుంటే కురుక్షేత్రం జరగడానికి కారణం ఒక
రకంగా వీళ్ళ స్నేహమే అని చెప్పుకోవచ్చు. ఇదే విఫలం అయిన స్నేహం.
ఆ రోజు ద్రోణాచార్యుడు అడిగిన రెండు ఆవులు ఇచ్చి ఉంటే ఒక
మహాసంగ్రామం జరిగి ఉండేది కాదు. మన స్నేహాన్ని కానీ మన
స్నేహితుడిని కానీ ఎన్నటికి మర్చిపోకూడదు. అందుకే అంటారు సంతోషంగా
ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు. అలాగే కోపంలో కానీ బాధలో కానీ ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు.
2. సఫలస్నేహం
దుర్యోధనుడు మరియు కర్ణుడు
Duryodhana Image Source :
9 Degrees Blogspot
Karna Image Source :
Dharma Today
మహాభారతంలో ఎక్కువగా ద్వేషించబడే పాత్ర ఏదైనా ఉంది
అంటే అది దుర్యోధనుడే. కానీ దుర్యోధనుడిని ద్వేషించినంతగా కర్ణుడిని ఎవరు ద్వేషించలేరు.
అయినా వారిద్దరికీ స్నేహం ఎలా కుదిరింది? ఇదంతా కౌరవులు పాండవులకు
వారి విద్యాభ్యాసం తరువాత జరిగిన ప్రదర్శన పోటిలో కర్ణుడు
ఆర్జునుడిని ఎదురించగా కర్ణుడు సూత పుత్రుడు కాబట్టి పోటిలో పాల్గొనే
అర్హత లేదు అని వెళ్ళిపోమని ద్రోణాచార్యుడు చెప్పాడు. అప్పుడు
దుర్యోధనుడు కర్ణుడిని తన మిత్రుడిగా చేస్కోవాలనుకున్నాడు. వెంటనే తన
తండ్రి అయిన దృతరాష్ట్రుడి సహాయంతో కర్ణుడిని అంగ రాజ్యానికి రాజును
చేశాడు. అందుకు కర్ణుడు దుర్యోధనుడి కోసం తన ప్రాణాన్ని అయిన
ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇది మనకు తెలిసిన కథే.
ఆర్జునుడిని ఎదురించడానికి కర్ణుడిని
స్నేహితుడిగా చేసుకున్నాడు అని మనకి తెలుసు. కానీ మనలో చాలా మంది దుర్యోధనుడు అలా చేసింది దుర్యోధనుడి స్వార్థం
కోసమే అని అంటారు. వారి స్నేహం ఎంత గొప్పదో చెప్పడానికి ఒక సంఘటన ఉంది.
పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినపుడు
దుర్యోధనుడి భార్య అయిన భానుమతి తన చెలికత్తెతో తమ అంతఃపురంలో జూదం
ఆడుతుంది. అదే సమయంలో దుర్యోధనుడిని కలవడానికి కర్ణుడు అక్కడికి
వచ్చాడు. "దుర్యోధనుడు లేడు, చిన్న పని ఉండి వెళ్ళారు, అక్కడే
కూర్చోండి" అని భానుమతి చెప్పగా అక్కడే ఒక కుర్చీలో కూర్చున్నాడు
కర్ణుడు. వారు ఆడుతున్న జూదం బాగా ఆసక్తికరంగా జరుగుతుంది. కర్ణుడు ఆ
ఆట చూస్తూ చెలికత్తె వైపు ఆడుతున్నాడు. చెలికత్తె కూడా అక్కడి నుంచి
పని ఉంది అని వెళ్ళిపోయింది. భాగుమతి కర్ణుడు ఇద్దరు ఆ ఆట లో లీనం
అయినప్పుడు, కర్ణుడి వెనక ఉన్న ద్వారం నుంచి దుర్యోధనుడు రాగానే
భానుమతి భయపడి లేచి వెళ్ళిపోతుంది. కర్ణుడు "ఎక్కడికి వెళ్తున్నావ్?"
అని తన చేత్తో భానుమతి నడుము దగ్గర ఉన్న ఒక పూసల వడ్డానాన్ని పట్టుకుని
లాగాడు. దాంతో ఆ వడ్డానం తెగి దాని పూసలు అన్ని కింద పడిపోయాయి. దాంతో
భానుమతి అక్కడే తల దించుకొని ఉండిపోయింది. కర్ణుడు కూడా తన తప్పు
తెలుసుకొని నిలబడిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు అక్కడ పడి ఉన్న పూసలను
ఎత్తి, భానుమతితో "భానుమతి! నా స్నేహితుడిని క్షమించు. తన తరపున నేను
క్షమాపణ కోరుతున్నాను. మీరు మళ్ళి కూర్చొని ఆట ఆడండి" అని అన్నాడు
దుర్యోధనుడు.
అలా కర్ణుడికి దుర్యోధనుడి మీద ఉన్న గౌరవం ఇంకా
పెరిగింది. తన భర్త ఎంతో క్రూరుడు అని అనుకున్న భానుమతికి ఇదంతా
చూసిన తరువాత చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ దుర్యోధనుడు తన
స్నేహితుడు అయిన కర్ణుడి మీద తనకు ఉన్న నమ్మకం మనకు తెలుస్తుంది.
మనకు ఒక చిన్న అపార్థం వస్తేనే స్నేహాన్ని, స్నేహితుడిని మర్చిపోతాం,
దుర్యోధనకర్ణుల స్నేహం మనకు ఆదర్శం అని చెప్పొచ్చు. ఇదే సఫలం అయిన
స్నేహం. కానీ వీరి స్నేహం ఒక మహాయుద్ధానికి దారి తీసింది. కేవలం కర్ణుడు
ఉన్నాడు అన్న నమ్మకంతో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం అయ్యాడు. ఈ
స్నేహం మంచి ఫలితాన్ని ఇచ్చిన స్నేహం కాదు.
౩. సుఫలస్నేహం
కృష్ణుడు మరియు అర్జునుడు
Image Source :
Quora
ఈ స్నేహం గురించి అందరికి తెలిసిందే. వీరిది బావ
బామ్మరిది అనుబంధం కంటే ఇద్దరు మంచి స్నేహితులు అని చెప్పుకోవచ్చు.
వారి స్నేహానికి ఫలితం, మనం ఈరోజు ఎంతో పవిత్రం అని భావిస్తున్న
భగవద్గీత. అర్జునుడికి విజయానికి దారి చూపించాడు కృష్ణుడు.
స్నేహితుడి విజయమే తన లక్షంగా చేసుకున్న కృష్ణుడు, అర్జునుడి
ప్రాణాన్ని చాలా సార్లు యుద్ధంలో కాపాడుతూ వచ్చాడు.
యుద్ధానికి ముందు దుర్యోధనుడు ఇంకా అర్జునుడు
యుద్ధానికి సహాయం కోరడానికి కృష్ణుడి మందిరానికి రాగా, కృష్ణుడు
నిద్రపోతున్నాడు, ముందు దుర్యోధనుడు వచ్చి కృష్ణుడి తల దగ్గర
ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తరువాత వచ్చిన అర్జునుడు కృష్ణుడి
కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కృష్ణుడు లేవగానే అర్జునుడిని చూశాడు
తరువాత దుర్యోధనుడిని చూశాడు కాబట్టి మొదట తనకు ఏం కావాలో
కోరుకోమని అర్జునుడికి అవకాశం ఇచ్చాడు. కానీ కృష్ణుడు ఒక షరతు
పెడతాడు తను తన నారాయణ సైన్యాన్ని అంతా ఒక వైపు ఇంకో వైపు తనే
ఉంటాడు, కానీ తను యుద్ధం చేయడు ఎలాంటి ఆయుధాన్ని పట్టడు అని
చెప్తాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడే కావలి అని కోరుకుంటాడు
అందుకు దుర్యోధనుడు చాలా ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అక్కడ అర్జునుడికి తన విజయం కన్నా స్నేహితుడి అండ కావాలని
కోరుకున్నాడు. కృష్ణుడి మీద ఉన్న నమ్మకం ఇంకా, కృష్ణుడు ఇచ్చే
ధైర్యమే తనకి విజయాన్ని తెచ్చి పెట్టింది.
కాని ఒకసారి ఈ స్నేహితులే యుద్ధం చేయడానికి
సిద్ధపడ్డారు. దాన్ని
కృష్ణార్జున యుద్ధంగా (దీని మీద క్లిక్ చేస్తే ఆ కథ గురించి వస్తుంది)
చెప్తారు. కానీ ఆ యుద్ధం తరువాత మళ్ళి స్నేహంగా ఉన్నారు. వీరి యుద్ధం
కురుక్షేత్రం కంటే ముందు జరిగింది. వీరిమధ్య యుద్ధం కూడా
జరిగిందా అని అనుకుంటాం. కాని ఆ యుద్ధం చేయడం వల్ల మనకి
అవసరమైన నీతి ఒకటి తెలుస్తుంది. మన స్నేహితుడి మీద ఎన్ని
కోపాలు ఉన్నా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా స్నేహితుడికి ఆపద
వచ్చినప్పుడు ఒకరికొకరు తోడు ఉండాలి. అలాగే ఈ స్నేహం మనకు
ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. దీన్నే సుఫలస్నేహం అంటే ఫలించిన
స్నేహం అంటారు. వీరి స్నేహమే కురుక్షేత్ర యుద్ధాన్ని
గెలిపించింది అలాగే మనకు ఎన్నో విషయాలకు కావలసిన
ఆత్మవిశ్వాసాన్ని అందించే భగవద్గీత మనకు దక్కింది.
జీవితంలో మనకు ఎంతో మంది స్నేహితులు
అవ్వొచ్చు. మన పక్కనే ఉంటూ మన మీద జోక్స్ వేసుకుంటూ,
తిట్టుకుంటూ, కొట్లాడుతూ, అలుగుతూ ఒకడు ఉంటాడు వాడే అవసరం
అయినప్పుడు మన భుజాన్ని తడతాడు మనకు అండగా ఉంటాడు. అది ఎంత
కష్టం అయినా సరే. ఇలాంటి స్నేహం మనకు ఉంటే వంటరిగా ఉన్నాం
అని అనుకోము పైగా మనకి తోడు ఉన్నారు అని భరోసా ఉంటుంది.
తల్లితండ్రుల తరువాత ఆ తోడు అనేది ఆ స్నేహితుడే ఇవ్వగలడు.
భార్య కూడా ఉంటుంది కాని మన జీవితంలో ఎక్కువ శాతం మన
స్నేహితులతోనే ఉంటాం. అలాంటి స్నేహితులందరికీ మంచి జరగాలి
అని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.
- భరత సంహితం
No comments:
Post a Comment