Pages

రామాయణంలో వివరించబడ్డ అనంతకోటి బ్రహ్మాండాలు - Multiverse in Ramayana

 


    Image Source: Medium

    మనము ఏదన్న సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మల్టీవర్స్ గురించి వినే ఉంటాం. మనకు తెలియని విజ్ఞానం ఈ లోకంలో చాలా ఉంది. అందులో ఈ మల్టీవర్స్ అంటే, అనంతకోటి బ్రహ్మాండాలు ఒకటి. దీంట్లో మనలాంటి భూములు ఎన్నో ఉన్నాయి అని, వాటిలో మనలాంటి వాళ్లు ఉన్నారు అని అంటూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజమో మనకు కొన్నిసార్లు అర్థం కాదు.

    కానీ ఈ మల్టీవర్స్ (పార్లల్ వరల్డ్స్) గురించి మొదట అటోమిసం అనే గ్రీకు తత్వశాస్త్రంలో వివరించబడింది అని చరిత్రకారులు చెబుతారు. తరువాత క్రీ.పూ. మూడవ సంవత్సరంలో తత్వశాస్త్రవేత్త అయిన క్రిసిప్పుస్ ఈ మల్టీవర్స్ గురించి ప్రస్తావన తీసుకొని వచ్చారు. తరువాత 1952లో డబ్లిన్ లో ఇర్విన్ స్క్రోడిన్గేర్ అనే ఆయన "నేను చేసిన పరిశోధనల ప్రకారం వివిధ చరిత్రలు ఒకేసారి జరిగాయి. ఇది ప్రత్యామ్నాయాలు కాదు, కానీ అన్నీ నిజంగా ఒకేసారి జరుగుతాయి" అని చెప్పాడు. దాని తరువాత ఎంతో మంది ఈ మల్టీవర్స్ గురించి ప్రస్తావన తీసుకొని వచ్చారు.

    మనకు తెలియని ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మల్టీవర్స్ గురించి రామాయణంలో ప్రస్తావన వచ్చింది. ఈ రామాయణం ఈ గ్రీకు తత్వశాస్త్రం కంటే ముందు నుంచి మన దేశంలో ఉంది. అసలు రామాయణంలో ఈ మల్టీవర్స్ గురించి ఎక్కడ ప్రస్తావించారో ఇప్పుడు తెలుసుకుందాం.

    ఒకరోజు రాముడు ధ్యానంలో ఉండగా తను వైకుంటానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది అని తెలుస్తుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతిజీవి చనిపోవాల్సిందే కనుక యమధర్మరాజును పిలిచాడు. కాని యమధర్మరాజు రాముడితో "ప్రభు! మీరు రావణుడితో యుద్ధం చేసేటప్పుడు హనుమంతుడు మీకు రథముగా ఉండి రావణాసురుడు వేసే మృత్యు బాణాలను మీకు తగలకుండా హనుమంతుడు అడ్డుకున్నాడు. మిమ్మల్ని ఆ మహిరావణుడు బంధించి తీసుకొని వెళ్ళినప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ హనుమంతుడు వచ్చి మిమ్మల్ని ఆ రాక్షసుడి నుండి కాపాడాడు. మీకు మృత్యువు సమీపిస్తుంది అని హనుమంతుడికి తెలిస్తే నాతో కూడా యుద్ధం చేస్తాడు. కాబట్టి హనుమంతుడు ఉండగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళలేను." అని యమధర్మరాజు చెప్తాడు.

    రాముడికి ఒక ఉపాయం వచ్చింది. అప్పుడు రాముడు యముడితో "ధర్మరాజా, కంగారు పడవద్దు. నేను హనుమంతుడి దృష్టిని వేరే పని మీద మరలుస్తాను. అప్పుడు నీవు నన్ను తీసుకొని వెళ్ళవచ్చు." అని చెప్తాడు. సరే అని యమధర్మరాజు అదృశ్యం అయిపోతాడు. అప్పుడు రాముడు తన చేతికి ఉన్న ఒక ఉంగరాన్ని తీసి కింద పడవేస్తాడు. ఆ ఉంగరం అక్కడే భూమి మీద ఉన్న ఒక చీలికలో పడిపోతుంది. వెంటనే రాముడు హనుమంతుడిని పిలుస్తాడు "హనుమ, నా ఉంగరము ఈ చీలికలో పడిపోయింది. అది నాకు ఎంత ప్రీతికరమైన ఉంగరము. దాన్ని తీసుకొని వస్తావా?" అని అడిగాడు.

    దానికి హనుమంతుడు "తప్పకుండా తీసుకొని వస్తాను ప్రభు" అని చెప్పి "జై శ్రీ రాం" అని తలచుకొని చిన్న రూపంలోకి మారి ఆ చీలిక లోపలికి వెళ్తాడు. ఆ చీలిక చాలా లోతుగా ఉంటుంది. చాలా దూరం ప్రయాణం చేశాక నాగలోకానికి చేరుకుంటాడు హనుమంతుడు. ఆ నాగలోకానికి ఒక పెద్ద ద్వారం ఉంది. ఆ ద్వారం దగ్గరే ఉన్న వాసుకి అనే ఒక సర్పం హనుమంతుడి రాకకు కారణం అడిగాడు. అందుకు హనుమంతుడు "సర్పరాజా, నేను నా రాముడి ఉంగరము కోసము వచ్చాను. ఆయన ఉంగరం ఇటువైపుగా వచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చాను" అని చెప్తాడు. వాసుకి హనుమంతుడితో "హనుమ, నీ రాముడి ఉంగరము ఇక్కడే ఉంది. వచ్చి చూడు" అని వాసుకి ఒక చోటుకి తీసుకొని వెళతాడు.

    ఆ చోటుని చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అక్కడ ఒక బంగారు కొండ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కొండ అంతా ఉంగరాలతో ఉంది. హనుమంతుడు దగ్గరకు వెళ్ళి చూస్తే అన్ని రాముడి ఉంగరాలే కనిపించాయి. ఏది అసలైన రాముడి ఉంగరం అని వెతుకుతూ ఉన్న హనుమంతుడిని చూసి వాసుకి "హనుమ, కంగారు పడకు. ఇవన్ని రాముడి ఉంగరాలే." అని చెప్తాడు. హనుమంతుడు అప్పుడు "నా ప్రభు ఒకటే ఉంగరాన్ని పడవేసాడు అని చెప్పారు. కానీ ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఏంటి?" అని అడుగుతాడు.

    అప్పుడు వాసుకి "హనుమ, ఇవన్ని రాముడి ఉంగరాలే కాకపోతే ఇవన్ని నీ రాముడి ఉంగరాలు కాదు. ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో ఎన్నో భూగ్రహాలు ఉన్నాయి ఆ భూగ్రహాలలో ఉన్న రాముడు ఈ ఉంగరాలను పదేవేస్తూ ఉంటాడు. కారణం తన మృత్యువు నుంచి నువ్వు తనని రక్షిస్తున్నావ్. నిన్ను దారి మల్లించడానికి రాముడు ఇలా నిన్ను పంపించాడు." అని చెప్పగానే హనుమంతుడు దుఖిస్తాడు.

    వాసుకి హనుమంతుడిని ఓదారుస్తూ "బాధపడకు హనుమ, పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే. రాముడు ఎప్పటికి మరణించడు. ఏదో ఒక లోకంలో ఇంకా బ్రతికే ఉంటాడు. రాముడికి మరణము లేదు. ఈ విషయం గురించి నువ్వు బాధ పడకు. ఏదో లోకంలో రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటుంది. నువ్వు నీ రాముడిని తలుచుకుంటూ ధ్యానం చెయ్యి ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉండిపోతాడు." అని చెప్పి హనుమంతుడికి రాముడి ఉంగరము ఇచ్చి పంపిస్తాడు.

    హనుమంతుడు భూలోకానికి వచ్చినప్పుడు రాముడు కనిపించలేదు. హనుమంతుడికి రాముడు నదిలోకి వెళ్ళి మళ్ళి తిరిగిరాలేదు అని వార్త తెలిసింది. హనుమంతుడికి కన్నీళ్ళు ఆగలేదు. ఎగురుకుంటూ హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అలా అక్కడే ఉంటూ ధ్యానంలో ఉండిపోయాడు హనుమంతుడు.

    ఈ మల్టీవర్స్ అనే సిద్ధాంతం ఎప్పుడో మనకు అందించబడింది. కానీ పాశ్చాత్య దేశాల ప్రభావము వలన మన దేశ సంపదతో పాటు మన విజ్ఞానాన్ని కూడా అనిచివేసారు. ఇలా రామాయణంలో ఉన్న మల్టీవర్స్ సిద్ధాంతాన్ని మనకు అందించినప్పటికీ మనం పాశ్చాత్యులే కనిపెట్టారు అని అనుకుంటున్నాం. ఇదే మన అజ్ఞానం. ఎన్నో విషయాలు కనుకునప్పటికి మన దేశం ఇప్పటికి వెనకబడే ఉంది. ఆ విజ్ఞానంతో పాటు మానవత్వం కూడా మనలోకి రావాలి అని ఆశిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి.

- భరత సంహితం

    Next Page→

No comments:

Post a Comment