Pages

మహిరావణుడు - Mahiraavan

 


    మాములుగా రామాయణం అంటే సీత కోసం రాముడు రావణాసురుడి మీద యుద్ధం చేసి సీతాదేవిని విడిపించాడు అని మన అందరికి తెలిసిందే. ఆ యుద్ధంలో ఎంతోమంది రాక్షస వీరులు మరణించారు. వారిలో ఒకడే ఈ మహిరావణుడు. అసలు ఈ మహిరావణుడు ఎవరి అతని కథ ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మహిరావణుడి గురించి వాల్మీకి రామాయణంలో లేదు. ఈ వాల్మీకి రాసిన రామాయణాన్ని ఆధారంగా తీసుకొని కొంతమంది రాసిన కథలలో ఈ మహిరావణుడి గురించి చెప్పారు.

    రామరావణ యుద్ధం జరుగుతుండగా రావణుడు తన కుమారుడు అయిన మేఘనాధుడిని కోల్పోతాడు. రావణుడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ రోజు యుద్ధం ముగిసింది. రావణుడు ఒంటరిగా తన సింహాసనం మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. వెంటనే తనకి మహిరావణుడు (రావణాసురుడి కొడుకు అని చెప్తారు) గుర్తుకు వచ్చాడు. మహిరావణుడికి కబురు పెట్టాడు. వెంటనే మహిరావణుడు రావణుడి ముందు నిల్చున్నాడు. రావణుడు జరిగింది అంతా మహిరావణుడికి చెప్పాడు. మహిరావణుడికి ఏం చెయ్యాలో చెప్పాడు.

    ఇంతలో మహిరావణుడి గురించి రాముడికి తెలిసింది. అది విని రాముడు విభీషనుడిని అతని గురించి అడగగా "రామా, ఈ మహిరావణుడు పెద్ద మాయావి. మా అన్నయ్య రావణాసురుడి కొడుకు. ఎన్నో మాయవిద్యాలు అతని సొంతం. మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా మీరు ఇంకా లక్ష్మణుడు. ఆ మహిరావణుడు ఏదో ఒక మాయ చేసి మిమ్మల్ని తీసుకొని వెళ్ళవచ్చు. కాబట్టి నిన్ను మన హనుమంతుడు రక్షిస్తాడు." అని హనుమంతుడి వైపు చూశాడు విభీషణుడు.

    హనుమంతుడు "జై శ్రీరామ్" అని తన తోకతో ఒక పెద్ద మేడను కట్టాడు. దానికి ఒకేఒక్క చోట లోపలికి వెళ్ళడానికి దారి వదిలాడు. రాముడు లక్ష్మణుడు ఆ రాత్రి అందులోనే పడుకున్నారు. హనుమంతుడు ఆ మేడ పైన కూర్చొని అంతా గమనిస్తున్నాడు.

    కొద్దిసేపు గడిచాక విభీషణుడు హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. "హనుమ, ఆ మహిరావణుడి గురించి కొన్ని విషయాలు తెలిసాయి. అతని గురించి రాముడితో మాట్లాడాలి కొద్దిగా దారి వదులు." అని చెప్పగా, హనుమంతుడు దారి వదిలి లోపలికి పంపించాడు.

    ఇంకొద్దిసేపు గడిచాక హనుమంతుడికి విభీషణుడు కనిపించాడు. హనుమంతుడు విభీషనుడిని పిలిచి "విభీషణ, నువ్వు ఇందాకే కదా లోపలికి వెళ్లావు. ఎలా బయటికి వచ్చావు?" అని హనుమంతుడు అడగగానే విభీషనుడికి అర్థం అయ్యింది. "హనుమ, ఒకసారి నీ తోకను వెనక్కి తీసుకొని చూడు" అని విబీషణుడు చెప్పగానే హనుమంతుడు తన తోకను వెనక్కి తీసుకున్నాడు. కానీ లోపల రాముడు లక్ష్మణుడు లేరు. హనుమంతుడు ఎలా జరిగింది అని విభీషనుడిని అడగగా "హనుమ, ఇందాక వచ్చింది మహిరావణుడు. నా రూపంలో వచ్చి రామలక్ష్మణులను తీసుకొని వెళ్ళిపోయాడు. అతను పాతాళలోకంలో ఉంటాడు. మనకు సమయం లేదు వారి ఇద్దరినీ ఆ మహిరావణుడు ఆ కాళికాదేవికి బలి ఇస్తాడు. కనుక నువ్వు తొందరగా వెళ్ళి వారిద్దరినీ కాపాడి తీసుకొని రావాలి హనుమ" అని విభీషణుడు చెప్పగానే హనుమంతుడు పైకి ఎగిరి పాతాళానికి వెళ్ళాడు.

    అది చాలా భయంకరమైన చోటు హనుమంతుడు సూక్ష్మరూపం ధరించి పాతాళానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ద్వారము కనిపించింది అందులో ప్రవేశించడానికి ప్రయత్నించగా ఒక వానరం హనుమంతుడిని అడ్డుకున్నాడు. హనుమంతుడు అందుకు "బాలకా, ఎవరు నీవు?" అని అడిగాడు. "నేను హనుమంతుడి పుత్రుడిని. నా పేరు మకరధ్వజుడు." అని చెప్పాడు ఆ వానరం. హనుమంతుడు ఆశ్చర్యముతో "ఇది అసంభవం, హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి దీక్షలో ఉన్నాడు." అని చెప్తాడు. అందుకు మకరధ్వజుడు "హనుమంతుడు ఒకరోజు నీటిలో సంధ్యావందనం చేస్తుండగా అతని చెమట చుక్క ఒక మొసలి మింగింది. ఆ ప్రతిఫలమే నేను." అని చెప్పాడు. హనుమంతుడు తన నిజమైన రూపానికి వచ్చి "కుమారా, నేనే నీ తండ్రిని. హనుమంతుడను. ఈరోజు మహిరావణుడు ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చాడు. వారు ఎక్కడ ఉన్నారో చెప్పగలవా?" అని అడిగాడు. "వారు కారాగారంలో ఉన్నారు" అని మకరధ్వజుడు చెప్పగా, హనుమంతుడు వెనుతిరిగి ఆ కారాగారం కోసం వెళ్తున్నప్పుడు ఆ మకరధ్వజుడు హనుమంతుడు అడ్డుకొని "నువ్వు లోపలికి వెళ్ళలేవు. నువ్వు వెళ్ళాలి అనుకుంటే నన్ను దాటి వెళ్ళాలి." అని చెప్తాడు. హనుమంతుడు మకరధ్వజుడితో యుద్ధం చేసి మకరధ్వజుడిని ఓడించి కారాగారం వైపు వెళ్ళాడు.

    అక్కడ రామలక్ష్మణులను చూసిన హనుమంతుడు వారి దగ్గరకు వెళ్ళి "ప్రభు మీరు నా భోజాలపైన కూర్చోండి. నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను." అని చెప్పాడు. అప్పుడు రాముడు "లేదు హనుమ, మనము ముందు ఈ మహిరావణుడిని హతమార్చి ఇక్కడి నుంచి వెళ్ళాలి." అని చెప్పాడు. అందుకు తగిన ప్రణాళిక రాముడు హనుమంతుడికి చెప్పాడు. దానికి సరే అని హనుమంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి రాముడికి దగ్గరగా ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు.

    అప్పుడు మహిరావణుడి భటులు వచ్చి రామలక్ష్మణులను బలి ఇచ్చే ప్రదేశానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ మహిరావణుడు ఒక కత్తి పట్టుకొని నిల్చున్నాడు. అప్పుడు మహిరావణుడు రాముడితో "రామా, ఆ బలి పీటం ముందు మోకరిల్లు" అని చెప్తాడు. అందుకు రాముడు "ఓ రాక్షస, నేను ఒక రాజ కుటుంబం నుంచి వచ్చాను. కనుక మోకరిల్లడం అంటే ఏంటో నాకు తెలీదు.  ఒకసారి నువ్వు చేసి చూపిస్తే నేను చేస్తాను." అని రాముడు చెప్పాడు. అందుకు మహిరావణుడు నవ్వుతూ "ఒక రాజువి అయ్యుంది మోకరిల్లడం ఏంటో తెలిదా!" అని తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేసాడు. వెళ్ళి ఆ బలి పీటం ముందు మోకరిల్లాడు మహిరావణుడు, వెంటనే హనుమంతుడు అక్కడ పడేసిన కత్తిని తీసుకొని మహిరావణుడి తలను నరికేసాడు.

    ఇలా మహిరావణుడు హనుమంతుడి చేతిలో మరణించాడు. తనకు ఎన్ని మాయలు మంత్రాలు వచ్చిన ఆ మహిరావణుడు యుక్తి ముందు ఆ శక్తులు పని చెయ్యలేదు. మహిరావణుడికి ఎన్ని విద్యలు వచ్చిన అది ఆఖరకు తనకు పని చెయ్యలేదు. అలాగే మనకు ఎన్ని విద్యలు వచ్చినప్పటికీ మనము దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురు అవుతాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. స్వస్తి.

- భరత సంహితం

←Previous Page

No comments:

Post a Comment