Pages

మధుకైటభుల కథ - Madhu Kaitabha Story

 


    మనకు రాక్షసులు అంటే రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు వీళ్ళు గుర్తుకు వస్తారు. కానీ వాళ్ళకంటే ముందు మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసోదరులు ఉండేవారు. వారు ఎవరు? ఎలా పుట్టారు? ఎలా అంతం అయ్యారు అని ఈ కథ ద్వార మనం తెలుసుకుందాం.
    పూర్వం మహాప్రళయం వచ్చి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. శ్రీమహావిష్ణువు తన శేషశయ్య మీద పడుకొని ఉన్నాడు. అప్పుడు ఆ మహావిష్ణువు చెవి గూలి కిందకు జారిపడింది. ఆ గూలి నుంచి జన్మించిన వారే మధుకైటభులు. వారు అదే సముద్రంలో పెరిగి పెద్ద అయ్యారు. కొద్దికాలానికి వారికి ఒక అనుమానం వచ్చింది. వారిని సృష్టించినది ఎవరు? ఈ నీళ్ళు ఏమిటి? అని చాలా ప్రశ్నలు మెదిలాయి. అదే సమయానికి ఆకాశంలో నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. వారు ఆ శబ్దాన్ని మనసులో తలుచుకుంటూ ఉండగా ఆకాశంలో నుంచి మెరుపులు రావడం మొదలు పెట్టాయి. వారి మనసులో అనుకున్నది మంత్రం అని గ్రహించారు. ఆ మంత్రాన్ని కొన్ని వేల సంవత్సరాలు జపం చేశారు. అందుకు మెచ్చిన ఆదిపరాశక్తి వారి ముందు ప్రత్యక్షం అయ్యింది. వారిని వరం కోరుకోమని చెప్పగా అమరులు అవ్వాలని వరం కోరతారు. అది సాధ్యంకాదు అని చెప్పి వేరే వరం కోరుకోమని చెప్పింది. అందుకు వారు "మాకు ఇచ్చా మరణం ప్రసాధించుము" అని కోరతారు. అమ్మవారు తదాస్తు అని మాయం అయిపొయింది.
    ఆ వర గర్వంతో ఇద్దరు ఆ సముద్రంలో ఉండగా వారు బ్రహ్మదేవుడిని చూసారు. ఆయన దగ్గరకు వెళ్ళి "ఓరి నువ్వు మాతో యుద్ధము చెయ్యి. లేదా ఈ చోటు నుంచి వెళ్ళిపో. నీలాంటి పిరికివారికి ఇక్కడ స్థానం లేదు." అని బెదిరించారు. బ్రహ్మదేవుడు తనకు భయము వేసి శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళగా. అతడిని వెంబడిస్తూ మధుకైటభులు వెళ్ళారు. బ్రహ్మ శ్రీమహావిష్ణువుతో "తండ్రీ, నన్ను రక్షించండి. ఆ రాక్షసులు నన్ను యుద్ధం చేయమని అడుగుతున్నారు. అలా చెయ్యకపోతే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతున్నారు. నీవే రక్ష." అని మహావిష్ణువు దగ్గర తన మోర వినిపించాడు బ్రహ్మ.
    సరే అని విష్ణువు మధుకైటభులకు ఎదురుగా వెళ్ళాడు. మధుకైటభులు విష్ణువును ఎదురుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. మొదట మధుడు విష్ణువుతో మల్ల యుద్ధం చేశాడు. తరువాత మధుడు అలిసిపోయాడు, ఇప్పుడు కైటభుడు మల్ల యుద్ధానికి వెళ్ళాడు. ఇద్దరు ఒకరి తరువాత ఒకరు విష్ణువుతో యుద్ధం చేశారు. కానీ విష్ణువు అలిసిపోతున్నాడు. దాదాపు అయిదు వేల సంవత్సరాలు సాగింది వారి యుద్ధం. విష్ణువు వారితో "మధుకైటభులారా, మీరు ఒకరి తరువాత ఒకరు నాతో యుద్ధం చేస్తున్నారు. ఒకరు యుద్ధం చేస్తూ ఉంటే ఇంకొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు విశ్రాంతి అనేదే లేదు. కొద్దిసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను. తరువాత మీతో యుద్ధం చేస్తాను" అని చెప్పగా దానికి ఒప్పుకున్నారు మధుకైటభులు.
    విష్ణువు కళ్ళు మూసుకొని ధ్యానించగా వారికి ఉన్న వరం తెలిసింది. వారిని ఎలా సంహరించాలి అని ఆలోచిస్తూ ఆదిపరాశక్తిని స్తుతించాడు. అప్పుడు ఆ ఆదిపరాశక్తి విష్ణువుతో "హరి, నువ్వు మళ్ళీ వాళ్ళతో యుద్ధం చెయ్యి, నువ్వు మోసంతోనే వారిని సంహరించాలి. నేను ఒక అందమైన యువతిగా వారికి కనిపిస్తాను. వారు ఆ ధ్యాసలో ఉండగా వారిని నువ్వు సంహరించు." అని చెప్పింది. విష్ణువుకు కొండంత బలం వచ్చింది మళ్ళి వారితో మల్ల యుద్ధానికి సిద్ధపడ్డాడు.
    మధుకైటభులు విష్ణువును చూసి "హరి, నువ్వు ఎంతో మందిని సంహరించావు. నువ్వు రాక్షసవైరివి అని అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు" అని వెక్కిరిస్తూ మాట్లాడేసరికి విష్ణువుకు కోపం వచ్చి వారితో యుద్ధం చేశాడు. చాలా సేపు యుద్ధం చేశాక విష్ణువు ఆ ఆదిపరాశక్తిని తలుచుకున్నాడు. వెంటనే అమ్మవారు ఒక అందమైన యువతిగా ఆ మధుకైటభులకు కనిపించింది. ఆమెను చూసిన మధుకైటభులు ప్రేమలో పడ్డారు. ఇదే సమయము అనుకోని విష్ణువు వారితో "మధుకైటభులారా, మీ శక్తికి మెచ్చి నేను మీకు ఒక వరం ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఏమి కావాలో కోరుకోండి" అని చెప్పాడు. వారు ఆ ప్రేమ మాయలోనే ఉంది అమ్మవారి మీద ఉన్న చూపు తిప్పుకోకుండా విష్ణువుతో "హరి, నువ్వు మాకు వరం కాదు. మేమే మీకు వరం ఇస్తాము కోరుకో" అని చెప్పగా విష్ణువు వెంటనే "మీరు నా చేతిలో మరణించాలి." అని కోరుకుంటాడు.
    అది విన్న మధుకైటభులు ఆశ్చర్యపోయారు. అప్పుడు వారు విష్ణువుతో "హరి, నీవు మాకు వరం ఇస్తాను అన్నావు కదా. ఇప్పుడు ఆ కోరిక మాకు కావాలి. నువ్వు అన్నట్టే మేము నీ చేతిలో మరణిస్తాము. కానీ మేము ఒక విశాలమైన ప్రదేశంలో నీరు లేని చోట మరణించాలి అని అనుకుంటున్నాము." అని కోరతారు. దానికి ఆ మహా విష్ణువు తన కాళ్ళను పెద్దగా చేసి తన తొడలను విశాలంగా చేశాడు అప్పుడు విష్ణువు "చూసారు కదా, మీరు కోరినట్టే విశాలమైన ప్రదేశం అంటే నా తొడలు బాగా విశాలంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు నా చేతిలో మరణించండి." అని చెప్పగా. మధుకైటభులు అందుకు అంగీకరించారు. విష్ణువు వారిని తన తొడల మీద నిలిపి తన సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండించాడు. ఇలా విష్ణువు చేతిలో మరో ఇద్దరు రాక్షసులు మరణించారు.
    మనకి కూడా ఎన్నో సమస్యలు ఎదురు అవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలకు చాలా సులభమైన పరిష్కారాలు ఉంటాయి. మనము ముందు ఆ సమస్య మూలాలకు వెళ్ళి అది ఎందుకు వచ్చిందో తెలుసుకొని తరువాత దానికి కావలసిన పరిష్కారాన్ని ఆలోచించాలి. ఎలాంటి సమస్యకు అయిన పరిష్కారం ఉంటుంది. దాన్ని మనం కనుక్కోవాలి, మనము సమస్య నుండి ఎప్పటికి పారిపోలేము. దానికి పరిష్కారం వెతికినప్పుడు మనసు చాలా తేలికగా అయిపోతుంది. కేవలం ఆ పరిష్కారం కోసమే మనము కష్టపడాలి. ఇంతటితో ఈ కథ సమాప్తం. స్వస్తి.

- భరత సంహితం

    

No comments:

Post a Comment