ఏకలవ్యుడు అనగానే మనకు గుర్తు వచ్చే కథ అతని బొటనవేలుని గురుదక్షిణగా అడిగిన ద్రోణాచార్యుడికి మారు మాట్లాడకుండా ఇచ్చేసిన ఒక గొప్ప గురుభక్తి కలవాడు అని మన అందరికి తెలిసిన కథ. అతను ఎవరు ఎందుకు చనిపోయాడు, మరలా ద్రుష్ట్యద్యుమ్నుడిగ ఎలా జన్మించాడు అన్నది మనం ఈ కథలో తెలుసుకుందాం.
వసుదేవుడి సోదరుడి పేరు దేవశ్రవుడు. దేవశ్రవుడికి ఒక కుమారుడు కలిగాడు. అతడి జాతకం పండితులకి చూపించగా అతడి పుట్టుక ఈ సమాజానికి చేటు చేకూరుస్తుంది అని చెప్పారు. దాంతో దేవశ్రవుడు ఆ బాలుడిని తీసుకొని అడవిలో వదిలేశాడు. ఆ బాలుడు వ్యతరాజ హిరణ్యదేను అనే నిషిద జాతి నాయకుడికి దొరికాడు. ఆయన ఆ బాలుడి పేరు ఏకలవ్యుడు అని నామకరణం చేశారు.
ఇక తరువాత అతను ద్రోణాచార్యుడి దగ్గర శిక్షణ నేర్చుకోవాలి అనుకోవడం, ద్రోణాచార్యుడు అందుకు నిరాకరించడం, ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి మట్టి విగ్రహం చేసి ఆ విగ్రహమే తన గురువు అని భావించి శిక్షణ తీసుకోవడం, అతని అస్త్రవిద్యను ఒక కుక్క నోట్లో ఉన్న బాణాలను చూసి అర్జునుడు ఆశర్యపోగా, ద్రోణచార్యుడి దగ్గరకు వెళ్ళి చెప్పడం, ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలు గురుదక్షిణగా అడగటం. ఇది మనకు తెలిసిందే.
మన అందరికి ఈ సన్నివేశంలో ద్రోణాచార్యుడి మీద కోపం కచ్చితంగా వస్తుంది. అర్జునుడికి ఇచ్చిన మాట కోసం ఒక కోయవాడి విద్యను లాక్కోవడం ఎంత వరకు సమంజసం అని. కానీ ద్రోణాచార్యుడి మనసులో ఒక అనుమానం ఉంది. అది ఏంటి అంటే "ఇంత విలువిద్య నేర్చుకున్న వాడు చెడు మార్గంలో వెళితే చాలా ప్రమాదం ఉంది" అని ఆలోచించాడు. లోకం తనను ఏమి అనుకున్న పరువాలేదు అని ఏకలవ్యుడి బొటనవేలును తీసుకున్నాడు.
కానీ ద్రోణాచార్యుడు దేనికి అయితే భయపడ్డాడో అదే జరిగింది. తన బొటనవేలు లేకున్నను ఏకలవ్యుడు విలువిద్యలో పెద్ద పేరు సంపాదించాడు. అతని విలువిద్యను చూసి జరాసంధుడు ఏకలవ్యుడిని తన సేనాధిపతిని చేశాడు. అలా జరాసంధుడు ద్వారక మీద దండెత్తి వచ్చాడు. ఇది తెలుసుకున్న కృష్ణుడు జరాసంధుడి సైన్యాన్ని ఓడించి ఏకలవ్యుడిని చంపబోగా అతనితో "సోదరా ఏకలవ్యా, నీవు నా సోదరుడవు. నీవు నా పినతండ్రి అయిన దేవశ్రవుడి కుమారుడవు. విధి వక్రించడం వల్ల నువ్వు అడవిలో నిషిద జాతికి చెందినా వాడిగా పెరిగావు. కానీ నువ్వు యాదవ వంశస్తుడివి. ద్రోణాచార్యుడు నీ గురించి భయపడింది నిజం అయినది. కానీ అతడు నీకు చాలా అన్యాయం చేశాడు. కనుక నీవు మరలా జన్మించి ఆ ద్రోణాచార్యుడిని చంపుతావు అని నీకు వరం ఇస్తున్నాను." అని చెప్పి కృష్ణుడు ఏకలవ్యుడిని చంపేస్తాడు.
ఇలా ఏకలవ్యుడు శ్రీకృష్ణుడి చేతిలో మరణిస్తాడు. అలా మరణించిన ఏకలవ్యుడు వచ్చే జన్మలో ద్రుష్ట్యద్యుమ్నుడిగా జన్మిస్తాడు. ద్రుపదుడు ద్రోణాచార్యుడి మీద ప్రతీకార జ్వాల నుంచి చేసిన ఒక యజ్ఞంలో నుంచి పుట్టాడు ద్రుష్ట్యద్యుమ్నుడు. కురుక్షేత్రంలో తన తండ్రిని చంపినందుకు ద్రుష్ట్యద్యుమ్నుడు ద్రోణాచార్యుడి తలను నరికి వేశాడు.
యుద్ధం గడిచిన తరువాత ద్రుష్ట్యద్యుమ్నుడు అశ్వర్థాముడి చేతిలో మరణించాడు.
మనకు ఎంత విజ్ఞానం ఉన్నా, ఏ విద్యలో ప్రావిణ్యం సంపాదించిన మనము ఆ విద్యను ఎలా ఉపయోగిస్తున్నాము అని మనము తెలుసుకోవాలి. మన విద్య మంచి కోసం మాత్రమే ఉపయోగించాలి. అలా కాకుండా నీ విద్య ఒకరికి చెడు చేయాలని చూసినా అది నీ పతనానికి మొదటి అడుగు అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఇంతటితో ఈ కథ సమాప్తం. స్వస్తి.
- భరత సంహితం
No comments:
Post a Comment