Image Source :
ArtStation
గరుత్మంతుడు అని చెప్పగానే మనకి గుర్తు వచ్చేది
విష్ణువు వాహనం అని. ఆయనని తిరుపతి లో చాలా చోట్లా గమనిస్తాం. ఆయన గొప్ప విష్ణువు
భక్తుడు అని మన అందరికి తెలుసు. ఆయనకి సంబధించిన ఒక కథ చాలా గొప్పది అని
చెప్పవచ్చు. తన తల్లి కోసం దేవతలతో సైతం పోరాడిన మహానుభావుడు గరుత్మంతుడు. ఆ కథ
ఏంటో తెలుసుకుందాం.
పూర్వం కశ్యప మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన సప్తఋషులల్లో
ఒకడు. ఆయనకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు వినత, రెండవ భార్య పేరు కద్రువ.
వినత చాలా సున్నితమైన మనసు కలది, కాని కద్రువకు వినత అంటే ఇష్టం ఉండేది కాదు.
వినత చెప్పే ప్రతి మాటను తప్పు పట్టడం, ఇదే పనిగా పెట్టుకునేది. వినతకు ఒక
కొడుకు ఉన్నాడు అతని పేరే గరుత్మంతుడు. కద్రువకు వంద మంది పాములు సంతానం.
ఒకరోజు ఉదయం వారిద్దరూ సముద్రతీరాన నడుస్తున్నారు. అప్పుడు
వారికి ఒక తెల్లని గుర్రం కనిపించింది. ఇద్దరికీ దాన్ని చూసి ఎంత బాగుందో అని
అనిపించింది. అప్పుడు వినత కద్రువతో "చెల్లి, ఆ గుర్రాన్ని చూసావా ఎంత
బాగుందో. తెల్లగా పాలు లో నుండి మునిగి వచ్చినట్టుగా ఎంత తెల్లగా ఉంది." అని
చెప్పింది. దానికి కద్రువ "ఆ గుర్రమా, అదేమీ తెల్లగా లేదు. దాని తోక నల్లగా
ఉంది" అని చెప్పింది. వినత అందుకు "అదేంటి చెల్లి, మన ముందే అంత బాగా
కనిపిస్తుంది కదా. నీకు నాకు వేరు వేరుగా ఎందుకు కనపడుతుంది. బాగా చూడు అంతా
తెల్లగానే ఉంది కదా." అని అంది. "లేదు, అది నల్లగానే ఉంది." అని చెప్పి
వెంటనే "నీ మాట కాదు నా మాట కాదు. మన కొడుకులను పిలిచి చూపిద్దాం. వాళ్ళు ఎలా
చెప్తారో చూద్దాం. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాస్యం చేయాలి." అని
చెప్పింది కద్రువ. అందుకు వినత సరే అని ఒప్పుకుంది.
వెంటనే కద్రువ తన వంద మంది పిల్లలను పిలిచింది. విషయం అంతా
చెప్పగా కొంత మంది పిల్లలు ఇలా అన్నారు "అమ్మ, ఎందుకమ్మా పెద్దమ్మను
ఇబ్బంది పెట్టడం. ఆ గుర్రం మొత్తం తెల్లగానే ఉంది. మేము చూశాం అమ్మ. ఇది
తప్పు కదా" అని చెప్పారు. దానికి కద్రువకు కోపం వచ్చింది, దాంతో "నా మాటకే
ఎదురు చెబుతారా! మీరందరూ సర్పయాగంలో మరణిస్తారు పోండి." అని శపించింది.
కొంతమంది పిల్లలు భయపడి తన అమ్మ మాట మన్నించాయి. రెండు పాములు వెళ్ళి ఆ
గుర్రం తోకకు చుట్టుకున్నాయి.
కద్రువ ఆ సాయంత్రం వినతను తీసుకొని వెళ్ళింది. ఆ సాయంత్రం
ఆ మసక చీకటిలో ఆ గుర్రం తోక నల్లగా కనిపించింది. వినత తన ఓటమిని
ఒప్పుకుంది. కద్రువకు దాస్యం చేస్తూ ఉండిపోయింది. అప్పుడు గరుత్మంతుడు తన
తల్లి దగ్గరికి వచ్చి "అమ్మ, నిన్ను నేను ఈ దాస్యం నుంచి విడిపిస్తాను.
నిన్ను ఈ పరిస్తితిలో చూడలేకపోతున్నాను. పినతల్లి కాళ్ళ మీద అయినా పడి
నిన్ను దాస్యం నుంచి విముక్తి చేయిస్తాను." అని చెప్పాడు.
గరుత్మంతుడు కద్రువ దగ్గరకు వెళ్ళి "తల్లి, నా తల్లిని
ఈ దాస్యం నుంచి విముక్తురాలిని చెయ్యి. అందుకు బదులుగా నీకు ఎం కావలి
అంటే అది నేను చేస్తాను." అని గరుత్మంతుడు కోరతాడు. "నాకు స్వర్గలోకంలో
ఉన్న అమృతం కావాలి తెచ్చి ఇవ్వు, అప్పుడు నీ తల్లిని విముక్తురాలిని
చేస్తాను." అని కద్రువ చెప్పింది. వెంటనే గరుత్మంతుడు వాయువేగంతో
స్వర్గలోకానికి పయనం అయ్యాడు.
అలా వెళ్తున్న గరుత్మంతుడికి ఒక అనుమానం వచ్చింది
"అమృతం తాగిన పాములు మరణించలేవు. కాని నాకు అవే ఆహారం కాబట్టి
వాటికి దక్కకుండా చెయ్యాలి." అని అలోచించి స్వర్గలోకానికి
చేరుకున్నాడు. ఇంద్రుడితో బాగా యుద్ధం చేశాడు. దేవతలతో బాగా యుద్ధం
చేసి అక్కడి నుంచి ఆ అమృత బాండాన్ని తీసుకొని తన ఇంటికి వచ్చాడు.
పినతల్లిని పిలిచి "తల్లి, ఇదిగో నువ్వు అడిగిన అమృతం. నా తల్లిని
విముక్తి చెయ్యి" అని గరుత్మంతుడు అడుగుతాడు. కద్రువ, వినతను
దాస్యవిముక్తి లభించింది. కద్రువ ఆ అమృతాన్ని తీస్కుంటూ ఉండగా
"తల్లి, ఈ అమృతం మహా పవిత్రం అయ్యినది. ఇది ఎక్కడ పడితే అక్కడ
పెట్టకూడదు. కింద దర్బగడ్డి వేసి ఇక్కడే పెడతాను. మీరు స్నానం చేసి
వచ్చి ఈ అమృతాన్ని తాగొచ్చు" అని గరుత్మంతుడు చెప్తాడు. కద్రువ తన
పిల్లలు స్నానం కోసం అని వెళ్ళగానే ఇంద్రుడు వచ్చి ఆ అమృత
బాండాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు.
తిరిగి వచ్చిన కద్రువ ఇదంతా గమనించి కోపంతో
"దుష్టుడా, నా పిల్లలకు అమృతాన్ని తెచ్చి ఇవ్వమంటే ఇంద్రుడికి
ఇచ్చి పంపిస్తావా. నువ్వు నీ మాటను తప్పవు, కనుక నీ తల్లి నాకు
ఇంకా దాసిగానే ఉంటుంది." అని చెప్పగా, గరుత్మంతుడు దానికి
"తల్లి, నేను ఇచ్చిన మాటను ఎప్పటికి తప్పను. మీరు అమృతాన్ని
తెచ్చి ఇవ్వమన్నారు కాని మీకు దగ్గర ఉండి తాగించాలి అని అనలేదు.
మీరు ఏం చెప్పారో నేను అదే చేసాను." అని చెప్తాడు. వెంటనే తన
తల్లిని తీసుకొని ఎగిరిపోయాడు గరుత్మంతుడు.
ఈ కథని చూస్తే చాలా విషయాలు మనకు అర్థం
అవుతుంది. తన స్వార్థం కోసం కద్రువ తన పిల్లలనే అబద్ధం
చెప్పమని అడుగుతుంది. తప్పు అని చెప్పిన వాళ్ళని శపిస్తుంది.
స్వార్థం కోసం మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఆ స్వార్థానికి
సొంతవాళ్ళని కూడా బలి చేయిస్తాము. ఇద్దరు శత్రువులు ఉన్నారు
అంటే అందులో ఒకడి మిత్రుడు తన శత్రువుతో మాట్లాడతామో కలిసి
ఉండటమో చూస్తే మనకు నచ్చదు. వాళ్ళతో తిరగాకూడదు అని కోపం
పెంచుకుంటారు తమ స్నేహితుల మీద. మన బంధువులు సరిగ్గలేరు అని
వాళ్ళ పిల్లలను బంధువులతో కలువనివ్వరు. మన కోపానికి మన
స్వార్థానికి మన వాళ్ళని అందులోకి దింపడం ఏం
బాగుంటుంది.
తల్లి కోసం ఆ గరుత్మంతుడు దేవతలను కూడా
ఎదురించాడు. మన తల్లి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? మా తండ్రి చేసిన అప్పుతో మాకు ఏంటి సంబంధం అని
తండ్రిని వదిలేసిన వాళ్ళని చూస్తున్నాం. ఆ తండ్రిని హింసించే
వాళ్ళ నుంచి మన తండ్రికి ఆ సహాయం చేయలేమా, కొద్దిగా ఉపసమనం ఆ
తండ్రికి అందించలేమా, ఇంకా, ఆ తండ్రికి కొడుకు లేదా కూతురు
మీద నమ్మకం ఉంటుంది. అలా చేసిన పిల్లలు వాళ్ళ పిల్లలకు
ఆదర్శం అవుతారు. అలాంటి ఆదర్శ కొడుకులు కూతుళ్ళు బాగుండాలని
కోరుతూ. స్వస్తి.
- భరత సంహితం
No comments:
Post a Comment