Pages

సాంఖ్య యోగం - భగవద్గీత రెండవ అధ్యాయం


    1. సంజయుడు పలికెను : ఈ రీతిగా అర్జునుడు దయావిష్ట చిత్తుడూ, శోకిస్తున్నవాడూ అయ్యి; అతని కన్నులు నీటితో నిండి కలతపడసాగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనితో ఈ విధంగా అన్నాడు.

        2. శ్రీకృష్ణుడు పలికెను : అర్జునా! ఈ సంకట సమయంలో ఆర్యులకు తగనిదీ, స్వర్గగతికి ప్రతిబంధకమూ, అపకీర్తిదాయకమూ అయిన ఈ మొహం నీకు ఎలా దాపురించింది?

        3. అర్జునా! కాతరతను పొందకు. ఇది నీకు తగదు. శత్రుతాపనా, తుచ్ఛమైన ఈ హృదయదౌర్బల్యాన్ని త్యజించు, యుద్ధం చేయడానికి సంసిద్ధుడవు కమ్ము, లెమ్ము!

        4. అర్జునుడు పలికెను : శత్రుమర్దనా మధుసూదనా! భీష్మద్రోణాదులు పూజ్యులు. వారిపైన బాణములను ఎలా వేస్తాను?

        5. మహానుభావులైన గురుజనులను వధించకుండా, భిక్షాన్న గ్రహణమొనర్చి జీవించినా, నాకు మేలే అవుతుంది కాని, వారిని చంపితే, వారి నెత్తురుతో తడిసిన ధనసంపదాలను, కామ్యభోగాలను ఎలా అనుభవిస్తాను.

        6. మనం వారిని జయించడమా? లేక వారు మనల్ని జయించడమా? ఈ రెంటిలో ఏది శ్రేయమో తెలియజాలకున్నాను. ఎవరిని వధించి మనం జీవింపగోరమో, ఆ దుర్యోధనాదులే మన ఎదుట ఉన్నారు.

        7. దీనతాదోషంతో నా శౌర్యస్వభావం సన్నగిల్లింది, నా చిత్తం ధర్మసందేహంలో చిక్కుకుంది. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకేది శుభమో నిశ్చయించి చెప్పు. నేను నీ శిష్యుణ్ణి, శరణాగతుణ్ణి, నన్ను శాసించు.

        8. శత్రువిహీనమైన, సమృద్ధమైన భూలోకరాజ్యాన్నే కాదు స్వర్గాధిపత్యాన్ని పొందినా కూడా, ఇంద్రియ సంతాపకరమైన ఈ శోకాన్ని నివారించే ఉపాయాన్ని కనుగొనలేకున్నాను.

        9. సంజయుడు పలికెను : శత్రుతాపనుడు, జితనిద్రుడు అయిన అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికి "నేను యుద్ధం చేయను" అని వచించి మౌనామ్ వహించాడు.

        10. ఓ ధృతరాష్ట్రా! శ్రీకృష్ణుడు రెండుసేనల నడుమ విషాదగ్రస్తుడైన అర్జునుణ్ణి ఉపహరిస్తూ ఇలా పలికెను.

        11. శ్రీకృష్ణుడు పలికెను : శోకింపదగని వారి గూర్చి నీవు దుఃఖిస్తున్నావు. అయినప్పటికీ, జ్ఞాని వలె భాషిస్తున్నావు. జ్ఞానులు మరణించిన వారిని గురించి గాని, జీవించి ఉన్న వారిని గురించి గాని దుఃఖించరు.

        12. నేను, నీవు, ఈ రాజులు పూర్వం ఒకప్పుడు లేకున్నామనడం సత్యం కాదు. ఈ శరీరధారణకు పూర్వం మనమందరమూ నిత్యాత్మ స్వరూపంలో ఉన్నాం. ఈ దేహ త్యాగానంతరం, మనమెవ్వరం నశించం. వర్తమాన కాలంలో కూడా మనం నిత్యఆత్మ స్వరూపంలో ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఉంటాం.

        13. దేహాభిమానీయైన జీవునికి ఈ దేహంలో బాల్య, యౌవన, వార్ధక్యాలు క్రమంగా కలుగుతున్నా జీవునికి ఎటువంటి మార్పూ కలగడం లేదు. అదే విధంగా దేహాంతరప్రాప్తియైనా జీవునికి ఎటువంటి మార్పూ కలుగదు. కనుక, జ్ఞానులు ఈ విషయంలో శోకించరు.


        14. ఓ అర్జునా! విషయేన్ద్రియ సంయోగం వల్లనే శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, అనుభూతమౌతున్నాయి. కాని, ఇవన్నీ అనిత్యమైనవి, ఉత్పత్తి వినాశ శీలములై ఉన్నాయి. వీతినన్నింటిని నీవు సహించు.

        15. ఎందుకంటే, పురుష శ్రేష్ఠ! సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, చలించని ఏ ధీరునికి శీతోష్ణాది ద్వంద్వాలు వ్యథను కలిగించవో, అతడే అమృతత్వాన్ని(మోక్షం) పొందడానికి అర్హత గలవాడు.

        16. అసత్తకు (అనాత్మ వస్తువులైన శీతోష్ణాదులకు ఆత్మయందు) ఉనికి లేదు. సద్వస్తువుకు(ఆత్మకు) వినాశం లేదు. తత్త్వవేత్తలు సత్-అసత్ వస్తువుల యుథార్థ స్వరూపాన్ని సాక్షాత్కారించుకున్నారు.

        17. నాశరహితమైన పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని యెరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరును నశింపజేయజాలరు.

        18. ఓ అర్జునా! ఈ దేహములు అన్నియును నశించునవియే. కానీ జీవాత్మ నాశరహితము కనుక నీవు యుద్ధము చేయుము.

        19. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతను చంపబడేది కాదు.

        20. ఈ ఆత్మ ఎన్నడూ జన్మించడం లేదు, మరణించడం లేదు. ఏలనన, పూర్వం ఉండకుండా తరువాత ఉండడమే జన్మ; పూర్వం ఉండి తర్వాతా ఉండకపోవడమే మృత్యువు. ఆత్మకు ఈ రెండిటిలో ఏ ఒక్కటీ లేదు. అంటే, ఆత్మకు జనన మరణాలు, వృద్ధి క్షయాలు లేవు. శరీరం నశించినప్పటికీ ఈ ఆత్మ వినష్టం కాదు.

        21. పార్థా! ఈ ఆత్మను అవినాశి, నిత్యం, ఆజం, అవ్యయం - అని గ్రహించిన వ్యక్తి, ఎవరిని ఎలా చంపిస్తాడు? ఎవరిని ఎలా చంపుతాడు?

        22. మనుజుడు వేసుకున్న వస్త్రాలను పరిత్యజించి ఇతర నూతన వస్త్రాలను ధరించే విధంగా, జీవాత్మ కూడా ధరించిన దేహాలను వీడి, నూతన దేహాలను పొందుతోంది.

        23. ఎటువంటి శస్త్రమైనా ఈ ఆత్మను ఛేదించ లేదు, అగ్ని దహించ లేదు, నీరు తడుపలేదు, గాలి ఎండింపజాలదు.

        24. ఈ ఆత్మ చేదించరానిది, దహింపరానిది, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఆత్మ నిత్యమైనది. సర్వవ్యాప్తిచెందినది, చలింపనిది స్థిరమైనది సనాతనమైనది.

        25. ఈ ఆత్మ ఇంద్రియాలకు గోచరముగానిది. మనస్సునకు అందినది. వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలిసికొనుము. కనుక ఓ అర్జునా! నీవు దీనికై శోకింపదగవు.

        26. ఓ అర్జునా! ఒకవేళ ఈ ఆత్మకు జననమరణములు కలవని నీవు భావించినప్పటికిని దీనికై నీవు శోకింపదగదు.

        27. పుట్టిన ప్రతివానికి మరణము తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక తప్పనిసరియైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.

        28. ఓ అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకుముందు ఇంద్రియ గోచరములు (కనిపించేవి) కావు - మరణానంతరము కూడా అవి అగోచరములే - ఈ జననమరణముల మధ్యకాలము నందు మాత్రమే అవి గోచరములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుటవలన ప్రయోజనములేదు.

        29. ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యమైనదానిగా చూస్తాడు, మరొకడు ఈ ఆత్మను విస్మయంతో వర్ణిస్తాడు, ఇంకొకడు ఈ ఆత్మ గురించి సవిస్మయంగా వింటాడు. మరొకడెవాడో దానిని చూసి, చెప్పి, విని కూడా తెలుసుకోలేకున్నాడు.

        30. ఓ అర్జునా! సమస్తప్రాణుల దేహాలలో ప్రకాశిస్తున్న ఆత్మ సదా అవధ్యం. కనుక, ఏ ప్రాణికి కలిగే దేహనాశాన్ని గురించి దుఃఖించడం నీకు తగదు.

        31. మరియు స్వధర్మాన్ని బట్టి చూస్తే, నీకు చలించడం తగదు. ఏలనన, ధర్మయుద్ధం కంటే క్షత్రియునికి మేలైనది వేరొకటి లేదు.

        32. అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధం అదృష్టవంతులైన క్షత్రయులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది.

        33. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయినవాడవు అగుదువు. దానివలన నీవు కీర్తిని కోల్పోయి, పాపము చేసినవాడవగుదువు.

        34. అదీగాక, జనులందరూ చిరకాలం నీ అపయశాన్ని(ప్రమాదం) ఘోషిస్తారు, లోకమాన్యుడైన వానికి అపయశం మృత్యువు కంటే కూడా దుఃఖదాయకం.

        35. మహారథులైన కర్ణాదులు నీవు భయపడి యుద్ధం నుండి తప్పుకున్నావని తలుస్తారు, అంతేకాక నిన్ను ఇంతవరకు సమ్మనించిన వారిచేతనే చులకన చేయబడతావు.

        36. అంతేకాక నీ శత్రువులు కూడా నీ సామర్థ్యాన్ని నిందిస్తూ, ఎన్నో అనరాని మాటలు అంటారు, దీనికంటే దుఃఖకరమైనది ఇంకేం ఉంటుంది?

        37. ఓ కౌంతేయా! యుద్ధంలో హతుడవైతే స్వర్గాన్ని పొందుతావు, జయిస్తే పృథ్విని భోగిస్తావు. కనుక యుద్ధం చేయడానికి నిశ్చయించుకుని లెమ్ము!

        38. యుద్ధం క్షత్రియ ధర్మమని స్థిరపరచుకుని, సుఖదుఃఖాలను లాభనష్టాలను, జయాపజయాలను సమంగా గ్రహించి యుద్ధం చేయడానికి సంసిద్ధుడవు కమ్ము! ఇలా చేస్తే పాపాన్ని పొందవు.

        39. పార్థా! నీకు సాంఖ్యమనే ఆత్మతత్వం ఉపదేశించబడింది. ఇక కర్మయోగాన్ని చెబుతున్నాను, విను. నిష్కామకర్మ యోగ విషయమైన ఈ జ్ఞానం లభిస్తే నీవు కర్మబంధనం నుండి విముక్తుడవవుతావు.

        40. ఈ నిష్కామకర్మ యోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికిని బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే యుండవు. పైగా ఈ నిష్కామకర్మ యోగమును ఏ కొంచెం సాధన చేసినను అది జన్మమృత్యురూప మహాభాయము నుండి కాపాడును.

        41. ఓ అర్జునా! ఈ నిష్కామకర్మ యోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియై యుండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై, ఒకదారి తెన్నూ లేక కోరికలవెంట నలువైపులా పరుగులు తీయుచూ అంతములుగా ఉంటాయి.

        42. అర్జునా! వేదవాదములందు రమించువారు, కామ్య కర్మలే అధికమని వాదించువారు, స్వర్గమై ఉన్నతమైనది భావించి ఇలా అంటారు.

        43-44. ఐశ్వర్యములయొక్క ప్రాప్తిని గురించినదియు కోరికలతో కూడినవారు, స్వర్గాభిలాషులును, జన్మమును, కర్మఫలము నోసగునట్టిదియును, భోగైస్వర్యములనిచ్చునదియు, భోగైస్వర్య ప్రసక్తికలవారలకు నిశ్చితమైన బుద్ధి ఉండదు.

        45. ఓ అర్జునా! వేదములు సత్వరజస్తమోగుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనాలను గూర్చియు ప్రతిపాదించును. నీవు భోగముల యెదలను వాటి సాధనలయందు ఆసక్తిని త్యజింపుము. సుఖదుఃఖాదిద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము.

        46. అన్నివైపులా జలముతో నిండియున్న మహాజలాశయం అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయములవలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తినందు పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతే ప్రయోజనం ఉంటుంది.

        47. కర్తవ్య కర్మమును ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని ఎన్నటికినీ దాని ఫలములయందులేదు. కర్మఫలములకు నీవు హేతువు(కారణం) కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కారాదు. అనగా ఫలాపేక్షరహితుడై కర్తవ్యబుద్ధితో కర్మలనాచరింపుము.

        48. ధనంజయా! కర్మఫలాలపై ఆసక్తిని పరిత్యజించి సిద్ధి-అసిద్ధులలో సమభావాన్ని వహంచి, యోగస్థుడవై(ఈశ్వరుణ్ణి ఆశ్రయించి) కర్మలను ఆచరించు. సిద్ధి-అసిద్ధులలో సమభావాన్ని వహించడాన్నే యోగం అని అంటారు.

        49. ఓ అర్జునా! ఈ సమత్వబుద్ధితో కూడిన నిష్కామ కర్మకంటే ప్రతిఫలాపెక్షతో కూడిన సకామకర్మ తక్కువైనది. కాబట్టి నీవు సమత్వబుద్ధియోగామునే ఆశ్రయింపుము. ఏలనన ఫలసక్తితో కర్మలు చేయువారు. అత్యంతదీనులు, కృపణులు.

        50. నిష్కామ కర్మయోగి ఇహలోక జీవితంలోనే పుణ్య పాపాలను రెండింటి నుండి కూడా ముక్తుడౌతాడు. కనుక నీవు నిష్కామ కర్మయోగాన్ని అనుష్టించు. కర్మల కౌశలమే యోగం.

        51. నిష్కామ కర్మయోగులైన ప్రాజ్ఞులు కర్మల వాళ్ళ కలిగే ఫలాలను త్యజించి, జన్మబంధాల నుండి విడివడి, సర్వోపద్రవ శూన్యమైన బ్రహ్మపాదాన్ని పొందుతారు.

        52. నీ బుద్ధి మోహకాలుష్యాన్ని అతిక్రమించినప్పుడు నీవు వినదగినవీ, వినినవీ అయిన కర్మల ఫల విషయంలో వైరాగ్యాన్ని పొందుతావు. ఈ రెండూ కూడా నీ వద్ద నిష్ఫలాలవుతాయి.

        53. నానా విధములైన మాటలను వినుటవలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా నిలిచి ఉన్నప్పుడే నీకు ఈ యోగం ఏర్పడును.

        54. అర్జునుడు పలికెను : కేశవా! సమాధిస్థుడైన స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి? అతడే విధంగా పలుకుతాడు? ఎలా ఉంటాడు? ఏ రీతిగా వ్యవహరిస్తాడు?

        55. శ్రీకృష్ణుడు పలికెను : పార్థా! మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా ఆత్మయందు సంతుష్టుడైనవానిని, అనగా పరమాత్మ సంయోగమువలన ఆత్మానందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని అందురు.

        56. దుఃఖాలలో క్రుంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడు ఐనట్టి మననశీలుడు (ముని) స్థితప్రజ్ఞుడు అనబడును.

        57. దేనియందు మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగానివాడు స్థితప్రజ్ఞుడు అనబడును.

        58. తాబేలు తన అంగములను అన్నివైపుల నుండి లోనికి ముడుచు కొనునట్లుగా, ఇంద్రియములను విషయాదుల నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను.

        59. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపనివానినుండి ఇంద్రియార్థములు మాత్రం వైదొలగును. కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందు వలన వానినుండి ఆ ఆసక్తిగూడ తొలగిపోవును.

        60. ఓ అర్జునా! ఇంద్రియములు మహాశక్తి కలవి, మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగిపోనంతవరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగికొని పోవుచునే యుండును.

        61. కనుక యోగి ఆ ఇంద్రియాలనన్నింటినీ నియమించి, సమాహితుడై ఆత్మస్థుడై(Spiritualist) ఉంటాడు. ఎవరికి ఇంద్రియాలు వశమౌతాయో అతని ప్రజ్ఞయే ప్రతిష్టితం(Prestigious). అతనే స్థితప్రజ్ఞుడు.

        62. విషయచింతన చేయు పురుషునకు ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము కల్గును.

        63. క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి ఛిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధినాశమువలన మనుష్యుడు పతనమగుచున్నాడు.

        64. ఇంద్రియములను వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను ప్రశాంతతను పొందుచున్నాడు.

        65. మనోనిర్మలత్వం వలన అతని దుఃఖములన్నియు నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్నీ విషయముల నుండి వైదొలగి, పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును.

        66. ఇంద్రియనిగ్రహం మనోనిగ్రహం లేనివానికి వివేకము కలుగదు.అట్టి మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తికభావమే కలుగదు. తద్భావనా హీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును?

        67. నీటిపై తేలుతున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరిస్తుంది.

        68. కనుక ఓ అర్జునా! ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్నీ విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగానుండును.

        69. సమస్త ప్రాణులకు ఏది రాత్రియో అప్పుడు యోగి మేల్కొని యుండును. ఎప్పుడు నశ్వరమైన (అశాశ్వతమైన) ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నియు మేల్కొని యుండునో అది పరమాత్మతత్త్వమును ఎరిగిన మునికి రాత్రిగానుండును.

        70. సమస్తదిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును సముద్రమును ఏ విధముగా చలింపకయున్న ప్రవేశించుచున్నదో అలాగే సమస్తభోగములను స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడై పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందలేడు.

        71. ఎవరైతే కోర్కేలనన్నిటినీ విడచి, 'నేను నాది' అనే భావం త్యజించి, శారీరక జీవితం కూడా స్పృహశూన్యుడై సంచరిస్తాడో అతడు సంసార దుఃఖ నివృత్తియైన పరమశాంతిని పొందుతాడు.

        72. ఓ అర్జునా! ఇదే బ్రాహ్మీస్థితి, దీనిని పొందినవారెవ్వరూ కూడా మొహగ్రస్తులు కారు, మరణ సమయంలోనైనా దీనిని పొందినవాడు మోక్షాన్ని పొందుతాడు.

No comments:

Post a Comment