1. అర్జునుడు పలికెను : ఓ కృష్ణా! నీ అభిప్రాయమును బట్టి కర్మకంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధకార్యమునందు నన్నెలా నియోగించుచున్నావు?
2. కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా చెప్పుము.
3. శ్రీకృష్ణుడు పలికెను - ఓ పాపరహితుడవైన అర్జునా! ఈ లోకమున నిష్టులు గలవు. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును.
4. మనుష్యుడు కర్మలను చేయకపోవుట వలన యోగనిష్ఠాసిద్ధి అతనికి
లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా
సాంఖ్యనిష్ఠను అతడు పొందడు.
5. ఎవడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రముగూడ కర్మను
ఆచరింపకుండ ఉండలేడు. మనుష్యులందరూ ప్రకృతినిత్యలైన గుణములకు లోబడి కర్మలను
చేయుటకు బాధ్యులగుదురు. ప్రతివ్యక్తియు అస్వతంత్రుడై కర్మను ఆచరింపవలసియే
యుండును.
6. బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియవ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియవిషయములను చింతించునట్టి మూఢుని కపటుడు అని అంటారు.
7. అర్జునా! మనస్సుతో ఇంద్రియములను వశపరచుకొని, అనాసక్తుడై ఇంద్రియములద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడుత్తముడు.
8. నీవు శాస్త్రవిహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుటకంటే చేయుటయే మేలుగదా! కర్మలను ఆచరింపనిచో నీ శరీరయాత్రగూడ సిద్ధింపదు.
9. ఓ అర్జునా! యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మ బంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపుము.
10. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞములద్వారా వృద్ధిచెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువువలె కోరిన కోరికలన్నిటిని తీర్చునది అగుగాక.
11. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరుచుడు. మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తిపరుచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు.
12. యజ్ఞములద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు అయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించేదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదనచేయక తానే అనుభవించువాడు నిజముగా చోరుడగును.
13. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠపురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యేదరు. తమ శరీరపోషణకొరకే ఆహారమును సిద్ధపరచుకొను పాపులు పాపమునారాగించిన వారైవున్నారు.
14. ప్రాణులన్నియు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి మేఘముల వలన ఏర్పడును. మేఘము యజ్ఞములవలన కలుగుతోంది.
15. సత్కర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు సత్కర్మలకు మూలములు. వేదములు పరబ్రహ్మనుండి ఉద్భవించినవని తెలిసికొనుము. అందువలన సర్వావ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్టితుడైయున్నాడు.
16. ఓ అర్జునా! ఈ ప్రకారముగా కొనసాగుచున్న సృష్టిచక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియసుఖములోలుడైన వాడు పాపి. అట్టివాని జీవితము వ్యర్థము.
17. ఎవడు కేవలం ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే సంతుష్టుడై యుండునో, అట్టి జ్ఞానికి చేయదగిన కార్యమేదియులేదు.
18. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుటవలన ప్రయోజనముగాని, చేయకుండుట వలనను దోషము ఉండదు. అనగా అతని సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగను లేదు.
19. అందువలన నీవు నిరంతరము ఫలాపేక్ష లేనివాడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఫలాపేక్ష వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును.
20. జనకుడు మున్నగువారు ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుటవలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవు లోకహితార్థమై కర్మలను చేయవలయును.
21. శ్రేష్ఠుడైన పురుషుడు ఏది ఆచరించునో ఇతరులను దానిని అనుసరింతురు. అనగా ఏ ప్రమాణము అతడు నిల్పునో ఇతరులు గ్రహింతురు.
22. ఓ అర్జునా! ఈ ముల్లోకములయందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియును లేదు. ఐనను నేను కర్మలను చేయుచునే ఉన్నాను.
23. ఓ పార్థా! ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్పహాని వాటిల్లును. ఎందుకనగా మనుష్యులందరును సర్వ విషముల నా మార్గమునే అనుసరించుచున్నారు.
No comments:
Post a Comment